
Telangana: దేశ ముఖచిత్రాన్ని మార్చివేసే కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జంగ్ సైరన్ ఊదాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్… నరేంద్ర మోడీ నేతృత్వంలోని పదేళ్ల ఎన్డీఏ నిరంకుశ, దుష్పరిపాలనకు చరమగీతం పాడాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను తెలంగాణ గడ్డమీద, అదీ శాసనసభ ఎన్నికలకు సమరశంఖం పూరించిన తుక్కుగూడ వేదికగానే విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో జనజాతర పేరిట నిర్వహించే భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 5 గ్యారంటీలను కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రకటించనుంది. ఈ భారీ బహిరంగ సభకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హాజరుకానున్నారు.
Read Also: KTR: ముఖ్యమంత్రి గుంపుమేస్త్రీ, ప్రధాని మంత్రి తాపీ మేస్త్రీ
పది లక్షల మందితో…
తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జన జాతర బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహించనుంది. మైదానం పక్కనే వాహనాల పార్కింగ్‌కు సుమారు 300 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం వంద రోజుల పాలనలోనే ప్రజాభీష్టాన్ని చూరగొంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షలకు పెంపు, 200యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీని విజయవంతంగా అమలు చేస్తోంది. 30 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చింది. 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. మొదటి తేదీనే ఉద్యోగులకు జీతాలు, పింఛనర్లకు పింఛన్లు అందజేస్తోంది. పదేళ్ల నిర్బంధ పాలన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ఈ భారీ బహిరంగ సభ దాదాపు 10 లక్షల మంది హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. పీసీసీ, చీఫ్, సీఎం రేవంత్ ఇప్పటికే తుక్కగూడ జనజాతర సభ ప్రాంగణాన్ని సందర్శించి సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Read Also: Manda Krishna: తన బిడ్డ భవిష్యత్ కోసమే.. కడియం శ్రీహరిపై మందకృష్ణ ఫైర్
తుక్కుగూడనే ఎందుకు…?
శాసనసభ ఎన్నికలకు తుక్కుగూడ నుంచే రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సమరశంఖం పూరించింది. తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబరు 17న తుక్కుగూడలో విజయభేరి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది. విజయభేరి వేదిక మీద నుంచే సోనియగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. రాష్ట్రంలో రేవంత్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో తమకు కలిసివచ్చిన తుక్కుగూడ నుంచే లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. తెలంగాణ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల హామీ ప్రజల్లోకి దూసుకెళ్లినట్లుగానే లోక్‌సభ ఎన్నికలకు ఇచ్చే అయిదు గ్యారెంటీలు దేశంలోని అన్ని మూలలకు, అన్ని వర్గాల్లోకి వెళుతాయని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం బలంగా నమ్ముతోంది.