Leading News Portal in Telugu

Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి



Chemical Factory

Fire Accident: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో గల కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్బీ కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. రియాక్టర్‌ పేలుడు ధాటికి రెండు భవనాలు కుప్పకూలాయి. గాయపడిన వారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Read Also: Film Chamber: హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో అగ్నిప్రమాదం

మంటల్లో చిక్కుకున్న కార్మికులు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసినట్లు స్థానికులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50 మంది కార్మికులు ఉన్నారు. పరిశ్రమలో మరో రియాక్టర్‌కు మంటలు వ్యాపించాయి. మరో రియాక్టర్‌ పేలితే ప్రమాదం అని అధికారులు అంటున్నారు. పరిశ్రమ పరిసరాల నుంచి ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు లోపల రియాక్టర్ పేలి భవనాల శకలాలు ఐదు వందల మీటర్ల ఎత్తున ఎగిసిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద స్థలాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి పరిశీలించారు.

ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి..
కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.వెంటనే ఘటన స్థలానికి వెళ్ళి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరారు.