Leading News Portal in Telugu

Off The Record : Secunderabad Cantonmentలో కమలం అభ్యర్థి ఎవరు?



Bjp Conttonment

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో కమలం పార్టీ అభ్యర్థి ఎవరు? మిగతా ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేసినా… బీజేపీ ఎందుకు ఇంకా వేచి చూస్తోంది? ఉప ఎన్నిక అభ్యర్థి విషయమై పార్టీకి ఉన్న లెక్కలేంటి? ఇక్కడ కూడా ఇంపోర్టెడ్‌ కల్చరే ఉంటుందా? లేక పార్టీ పాత నేతలకు అవకాశం ఇస్తారా? కంటోన్మెంట్‌ కేంద్రంగా కమలం పార్టీలో ఏం జరుగుతోంది? లోక్ సభ ఎన్నికలతో పాటే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ గణేష్ బరిలో ఉండబోతున్నారు. శ్రీ గణేష్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2018 లోనూ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారాయన. ఇక బీఆర్‌ఎస్‌ నుంచి లాస్య నందిత చెల్లెలు నివేదిత పోటీలో ఉండవచ్చంటున్నారు. అయితే బీజేపీ అభ్యర్థిత్వంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఇక్కడ రెండో స్థానం లో నిలిచింది. అయితే ఇప్పుడు అదే అభ్యర్థి కాంగ్రెస్ నుండి పోటీలో ఉండటం ఆసక్తిగా మారింది. దీంతో కమలం పార్టీ తరపున పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈసారి జంపింగ్‌ జపాంగ్‌లకు ఇవ్వవద్దన్న డిమాండ్‌ పార్టీ వర్గాల్లో పెరుగుతోంది. కొత్త వారికి కాకుండా పాత వాళ్ళకే ఇవ్వాలని అంటున్నారు.

బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు భాషా టిక్కెట్‌ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలతో లాబీయింగ్‌ చేస్తున్నారట ఆయన. అలాగే మాజీ మంత్రి సదాలక్ష్మి కుమారుడు వంశీ తిలక్ కూడా టికెట్ ఆశిస్తున్నారట. మరోవైపు గత ఎన్నికల్లో సైతం సీటు ఆశించి గ్రౌండ్ వర్క్ చేసుకున్న మాజీ మంత్రి శంకర్రావు కుమార్తె సుష్మిత బీజేపీ టిక్కెట్‌ రేస్‌లో ఉన్నారు. మాజీ ఎంపీ వర్రి తులసీ రామ్ కుమారుడు విజయ్ కుమార్ ఆశావహుల లిస్ట్‌లో ఉన్నారు. ఆర్థిక కోణంలో చూస్తే విజయ్‌కుమార్‌ అవకాశం ఉండవచ్చంటున్నారు. హైదరాబాద్ మాజీ మేయర్ శాంరావు మనవడు సందీప్ సాయి కూడా లైన్‌లో ఉన్నారట. అలాగే… టికెట్ రాని ఓ మాజీ ఎంపీ పేరు కూడా వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సెంటిమెంట్ ను నమ్ముకోగా , కాంగ్రెస్ గత ఎన్నికల్లో రెండో స్థానం లో నిల్చిన వ్యక్తికి పార్టీ కండువా కప్పి టికెట్ ఇచ్చింది… బీజేపీ అర్థ, అంగ బలం ఉన్న బలమైన నేత కోసం వెదుకుతోంది. దీంతో కంటోన్మెంట్‌ బీజేపీ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తిగా మారింది.