
తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తాండూరు సమీపంలోని కాగ్నా నది నుండి త్రాగు నీరు అందించే పంప్ హౌస్ ను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశీలించారు.
ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైనదని, దీనిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యతనిస్తూ అనునిత్యం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తితే వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలతో అధికారులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. చేతి పంపులు, బోరు మోటార్లు, పైప్ లైన్ల మరమ్మతులు వంటివి సకాలంలో చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించడం జరుగుతుందని ఆయన అన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వేసవిని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో పశువుల కోసం నీటి తొట్టిలను ఏర్పాటు చేసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. కాగ్న నది ఇంటెక్ వెల్ నుండి కొడంగల్, యాలాల మండలంలోని గ్రామాలకు మంచి నీరు 2.5 ఎంఎల్డి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. నీటి స్వచ్ఛతను తెలుసుకోవడానికి వీలుగా ప్రతి గ్రామ పంచాయతీకి క్లోరోస్కోప్ కిట్లను పంపిణీ చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల నిధులతో 19,605 చేతిపంపులు, 14708 సింగల్ ఫేస్ , 5 హెచ్పి పంపుసెట్లు, 605 మంచినీటి బావులు, 662 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ మరమ్మతులు స్పెషల్ డ్రైవ్ కింద అవును నువ్వు చెప్పడానికి జరిగిందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాకు 3.54 కోట్ల నిధులను మంజూరు చేయగా ఈ నిధులతో 1044 పంపు సెట్లు 495 చేతిపంపులకు మరమ్మత్తులు చేయించామని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 23975 గ్రామాలకు 37002 ఓహెచ్ఎస్ఆర్ ల ద్వారా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మంచినీటిని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి పది రోజులకు ఒకసారి ఓహెచ్ఎస్ఆర్ క్లోరినేషన్ చేసి పరిశుద్ధమైన మంచినీటిని ప్రజలకు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. తదనంతరం పరిగి మండలం రాఘవపూర్ 135 ఎమ్.ఎల్.డి నీ సందర్శించి ఏఏ గ్రామాలకు త్రాగునీరు చేరుతున్న విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.