
ఈ లోక్ సభ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ షాద్ నగర్ నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా షాద్ నగర్ వాసి బూర్గుల రామకృష్ణారావు నాయకత్వం వహించారన్నారు. మళ్లీ 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్ జిల్లా కు కీలకమైన మంత్రి పదవులు కూడా రాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కల్వకుర్తి, సంగంబండ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, లక్ష్మీదేవి పల్లి ఎత్తిపోతల, బీమా . నెట్టంపాడు లాంటి ప్రాజెక్ట్ లు తెలంగాణ రాష్ట్రంలో కూడా పెండింగ్ లో ఉన్నాయని, మహబూబ్ నగర్ ప్రజలు కేసీఆర్ ను భుజాన మోసి పార్లమెంటుకు పంపిస్తే ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువగా పాలమూరుకు అన్యాయం చేశాడని, పాలమూరు ప్రజలు నాటిన మొక్క వృక్షమై ముఖ్యమంత్రి అయిందని ఆయన వ్యాఖ్యానించారు. డీకే అరుణ ను కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ, ఎమ్మెల్యే, మంత్రి ని చేసిందని, కాంగ్రెస్ పార్టీ వల్లనే డీకే అరుణకు గుర్తింపు వచ్చిందన్నారు సీఎం రేవంత్. శత్రువు పక్కన చేరి రేవంత్ రెడ్డిని పడగొడతానని డీకే అరుణ కుట్రలు చేస్తోందని, అరుణమ్మ బొడ్డులో కత్తి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ని ఓడిస్తానంటే కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా..’ జిల్లాకు వచ్చిన ఏమీ చేయనందుకు పాలమూరు బిడ్డలకు ప్రధాని మోదీ క్షమాపణ చెపుతాడనుకున్న.. డీకే అరుణ పట్టుపట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా తెప్పిస్తారనుకున్న… తెలంగాణ కు పునర్విభజన చట్టంలో ఇచ్చిన ప్రాజెక్ట్ లను మోదీ ఇస్తారని అనుకున్న… మన ప్రాజెక్టులు, పాలమూరు వలస బతుకుల గురించి నరేంద్ర మోదీ మాట్లాడలేదు.. పాలమూరు కు వచ్చిన మోదీ ఈ ప్రాంతం గురించి మాట్లాడతారని అనుకున్న…. అవినీతి , దోపిడీ గురించి చెప్పేటప్పుడు తన పక్కన ఎవరున్నారో మోదీ చూసుకోవాలి… పాలమూరు లో కల్లు దుకాణాల నుంచి మామూళ్లు, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసింది,దొంగ సారా వ్యాపారం చేసింది ఎవరో అందరికీ తెలుసు… ఇసుక, చెట్టు, చేమ, పుట్టను వదలకుండా పాలమూరు జిల్లాను డీకే కుటుంబం దోచుకుంది.. మోదీ.. డీకే కుటుంబ చర్రిత ఏమిటో తెలియదా… ..? ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గజదొంగలు ఎవ్వరో తెలుసుకోవా మోడీ.. నేను ఎప్పుడైనా ఒక్క రూపాయి అడిగానా.. లేక ఎవరికైనా ఫోన్ చేశానా..? పాలమూరు జిల్లా ప్రజలను అడగండి.. నలమల్ల నుంచి రైతు బిడ్డ గా కష్టపడి ముఖ్యమంత్రి పదవి వరకు వచ్చిన నన్ను నా జిల్లాకు వచ్చి అవమానిస్తారా..? డీకే చరిత్ర ఏమిటో, రేవంతన్న చరిత్ర ఏమిటో పాలమూరు బిడ్డలను అడుగు చెపుతారు… మోడీ… ఎవరు కల్లీ కల్లు అమ్మారో, దొంగ సారా అమ్మారో, రియల్ ఎస్టేట్ దగ్గర కమిషన్లు తీసుకున్నారో.. షాద్ నగర్ చౌరస్తా లో సవాళ్లకు సిద్ధమా.. నేను దందాలు చేసినట్లు నిరూపిస్తే షాద్ నగర్ చౌరస్తా లో ముక్కు నేలకు రాస్తా.. లేకపోతే నాలుగు కోట్ల ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి .. మోడీ గారు.. దేశ ప్రధాని గా ఆరోపణలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి… కార్యకర్తలకు కష్టం వల్లనే సీఎం అయ్యాను.. మోడీ… మీరు చేసిన అవమానం పాలమూరు బిడ్డలను చేసినట్లు .. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పాలమూరులో కుమ్మక్కు , దగాకోరు రాజకీయాలు చేస్తున్నయి….
పాలమూరు నాయకత్వాన్ని బలహీ పర్చాలని కుట్ర జరుగుతోంది.. బీఆర్ఎస్ వాళ్లు బీజేపీ కి అమ్ముడుపోయి డీకే అరుణ ని గెలిపించాలని ప్రయత్నిస్తున్నారు… కుమ్మక్కు రాజకీయాలపైన బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి.. బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలను తాకట్టు పెడుతున్నారు.. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలంటే రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి.. వైఎస్ నాయకత్వంలో అవుటర్ రింగ్ రోడ్డు, ఐటీ కంపెనీలు, ఎయిర్ పోర్టులు తీసుకురావడం వల్లనే షాద్ నగర్ భూములకు విలువ వచ్చింది… హైదరాబాద్ లో మతకల్లోలాలు లేవు.. అందుకే అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది.. గుజరాత్ నుంచి వచ్చిన నాయకులు తెలంగాణలో మతకల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు… శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, పోచమ్మ ఎల్లమ్మ పండుగలు, జహంగీర్ దర్గా ప్రార్థనలు మనం చేయలేదా..? ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు… దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.. వారే అసలైన హిందువు… దేవుని తీసుకువచ్చి బీజేపీ వాళ్లు బిచ్చమెత్తు కుంటున్నారు…… యూపీలో మతకల్లోలాలు స్రుష్టించి బుల్ డోజర్లతో కూల్చుతుంటే ఎవరూ పెట్టుబడులు పెట్టడం లేదు.. మతకల్లోలాలు వల్ల ఉత్తర ప్రదేశ్ దివాళా తీసింది… మతాలు, మనుషుల మధ్య చిచ్చు పెట్టి మత కల్లోలాలు సృష్టిస్తే తెలంగాణ కు పెట్టుబడులు వస్తాయా…?
తెలంగాణను ఏడారిగా మార్చి, పడగా పెట్టే ప్రయత్నం జరుగుతోంది… గుజరాత్ బాగుండాలి, తెలంగాణలో మాత్రం కత్తులతో పొడ్చుకోవాలా.. మతసామరస్యం, శాంతిభద్రతలను కాపాడే బాధ్యత నాది.. షాద్ నగర్ కు మెట్రో రైలు తీసుకువస్తా.. .. షాద్ నగర్ ను నగరం గా మారుస్తా… ఎస్సీ వర్గీకరణ , ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏ కి మార్చాలంటే వంశీచంద్ రెడ్డి ని గెలిపించాలి…. పాలమూరు పౌరుషానికి, ఢిల్లీ సుల్తాన్ లకు మధ్య పోటీ… 100 రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశాను… బీఆర్ఎస్ కారు ఖార్కానా కు పోయింది .. అది తిరిగిరాదు.. కేసీఆర్ బస్సు యాత్ర తిక్కలోడు తిరునాళ్ళకు పోయినట్టే ఉంది.. పదేళ్లు ఏం చేయలేదు కాబట్టే బీఆర్ఎస్ ను బొంద పెట్టారు… జహంగీర్ దర్గా సాక్షిగా చెపుతున్న ఆగస్టు 15 లోపు రుణ మాఫీ చేస్తా…. రుణమాఫీ చేసి సిద్దిపేట కు పట్టిన శనిశ్వర్ రావు ను వదిలిస్తా… మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి కి లక్ష మెజారిటీ ఇవ్వాలి..’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.