Leading News Portal in Telugu

Kishan Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ


Kishan Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తన్నవే మళ్లీ హామీలుగా చెప్తారా? అని, కాంగ్రెస్ మేనిఫెస్టో తెలంగాణ హామీలు అంతా డొల్ల అని ఆయన లేఖలో విమర్శించారు. కాంగ్రెస్ హామీలు, ప్రకటనలు ఆ పార్టీని మరింత దిగజార్చేలా ఉన్నాయని, తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయన్నారు కిషన్‌ రెడ్డి. చాలా హామీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందని, మరికొన్నింటిని అమలు చేస్తుందన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థకు నేరుగా నిధులు ఇస్తున్న విషయాన్ని మరిచిపోయి కాంగ్రెస్ 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు నేరుగా కేంద్ర ప్రభుత్వ నిధుల మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి పంచాయతీరాజ్ సంస్థల అకౌంట్లలోకి పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా నేరుగా నిధులను జమ చేస్తోందన్నారు కిషన్‌ రెడ్డి. బడ్జెట్ లో కేంద్రం ప్రకటించిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను పేరు మార్చి కొత్త వాగ్దానంగా మేనిఫెస్టోలో పెట్టారని, ఈ పథకానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి భయపడిన కాంగ్రెస్ పార్టీ.. ఈ అంశాన్ని కాస్త అటు, ఇటుగా మార్చి కొత్తగా ఏదో వాగ్దానం చేస్తున్నట్లు మేనిఫెస్టోలో పెట్టిందన్నారు కిషన్‌ రెడ్డి.


అంతేకాకుండా..’దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం, ఘంటసాల ఆడిటోరియం, CSIR-IICT ప్రాంగణంలో సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ వంటివి హైదరాబాద్‌ నగరాన్ని కల్చరల్, ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మారుస్తున్నాయని, కాంగ్రెస్ ప్రకటించిన ఇంటర్నేషనల్ కల్చరల్, ఎంటర్‌టైన్‌మెంట్ హబ్ తో కొత్తగా కలిగే ప్రయోజనం ఏముంది. 2008లోనే హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ITIR) ప్రాజెక్టు ప్రకటించి, 2013 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమీ చేయలేదు. ఇప్పుడు చేస్తామంటే ఎలా నమ్మాలి. కాజీపేటలో ఇప్పటికే రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇప్పుడు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామనడం పూర్తయిన హామీని మళ్లీ ఇచ్చినట్టుంది. రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ బయ్యారం ఉక్కు కార్మాగారాన్ని తెరపైకి తెచ్చిందని, ఇవన్నీ ఉత్తి హామీలే. డ్రై పోర్టుల స్థాపన, హైదరాబాద్‌లో IIM, IIFT, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ (IISER) ఏర్పాటు, వైద్యరంగంలో అత్యాధునిక పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ICMR) ఏర్పాటు వంటివన్నీ కాంగ్రెస్ చిత్తశుద్ధిరాహిత్యాన్ని అద్దం పడుతున్నాయి. 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం రూపొందించి, ఆమోదిందిచిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే భద్రాచలం మండలంలోని ఐదు గ్రామాలు – ఏటపాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నెగూడం, పిచుకలపాడు ఆంధ్రప్రదేశ్ కు బదిలీ అయ్యాయి

4వేల కోట్లతో రామగుండం-మణుగూరు రైల్వే లైన్ డీపీఆర్ సిద్ధమైందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని, నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్రెడిట్ తీసుకోవాలనుకుంటుంది తెలంగాణలో కొత్త సైనిక పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే గత రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోయిందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమైనా ఇందుకు సహకరించాలని అన్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి సమాంతరంగా ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్, తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, జాతీయ విమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటు అమల్లోనే ఉన్నాయని, మోదీ ప్రభుత్వ ప్రాజెక్టులను తమ ఘనతలు చెప్పుకోవాలన్న తాపత్రయం తప్పితే తెలంగాణకు మేలు చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ కు లేదు’ అని కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.