
Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. శనివారంతో పార్టీల ప్రచారానికి తెరపడింది. దీంతో కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య పోలింగ్ కోసం ఏర్పాట్లను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఇప్పటికే, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో భారీ సంఖ్యలో సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను ఈసీ గుర్తించింది. సెంట్రల్ ఫోర్స్, మైక్రో అబ్సర్వర్స్, వెబ్ కాస్టింగ్ తో మానిటరింగ్ చేసేలా తగిన ఏర్పాట్లను చేసింది. రేపు (మే 13) ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం నుంచే రెండు రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకొచ్చింది.
ఇక, వందల సంఖ్యలో పారామిలిటరీ బలగాలను ఈసీ మోహరించింది. ఈ ఎన్నికల్లో భారీగా మద్యాన్ని, నగదునూ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. తెలంగాణలో 300 కోట్ల రూపాయలకు పైగా నగదు పట్టుబడితే, ఆంధ్రప్రదేశ్ లో అంతా కలిపి దాదాపు 270 కోట్ల రూపాయల విలువైన సొత్తును సీజ్ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మరి, ఎన్నికల్లో ఈ డబ్బు, మద్యం ప్రభావం ఎంత వరకు పని చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. గుట్టు చప్పుడు కాకుండా జరిగే పంపకాల కార్యక్రమంపై కూడా ఈసీ నజర్ పెట్టింది.
కాగా, మరోవైపు ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు అవగాహన కార్యక్రమాలను సైతం చేపట్టింది. ఓటు హక్కును వినియోగించుకోవాలని విస్తృతంగా హోర్డింగులు పెట్టి మరీ ప్రచారం చేస్తుంది. ఇటు, ఓట్ల కోసం నగర వాసులు.. సొంతూర్లకు తరలి వెళ్తున్నారు. మరి, ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా?లేదా? అన్నది కీలకంగా మారింది. ఈసారి కొత్తగా లక్షల మంది యంగ్ ఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే 10 లక్షలకు పైగా యువ ఓటర్లు.. తొలి సారి తమ ఓటు హక్కును వేయబోతున్నారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే, తెలంగాణలోని యువ ఓటర్లు సైతం ఎవరికి మద్దతు ఇస్తారనే కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.