- వైద్యులకు మంత్రి సీతక్క సంఘీభావం
- కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం హేయమన్న మంత్రి

Minister Seethakka: గాంధీ ఆస్పత్రిలో కోల్‌కతా హత్యాచార ఘటనకు నిరసన చేపట్టిన వైద్యులకు మంత్రి సీతక్క సంఘీభావం ప్రకటించారు. ఓ రోగిని పరామర్శించేందుకు గాంధీ ఆసుపత్రికి వచ్చిన మంత్రి సీతక్క.. మహిళలపై అఘాయిత్యాలను నిలువరించాలని వ్యాఖ్యానించారు. మహిళలు దేవతలతో సమానమని.. ఇప్పుడిప్పుడే మహిళలు బయటకి వస్తున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలు మహిళలను మళ్ళీ మధ్య యుగాలకు తీసుకువెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం హేయమని.. వైద్యులకు అండగా మేము నిలబడతామన్నారు. తరగతి గదుల నుంచి మహిళలను గౌరవించాలి అని నేర్పించాలన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా ఉపేక్షించకూడదని వ్యాఖ్యానించారు.
మహిళా రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని.. మహిళా భద్రతపై ప్రతి ఒక్కరి ఆలోచన మారాలి అందుకోసం కృషి చేస్తామన్నారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే మహిళా భద్రతపై కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. కఠినమైన చట్టాలను అమలు చేయడంతో పాటు ఇలాంటివి జరగకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మహిళా భద్రతకు కృషి చేస్తామన్నారు. వైద్యుల భద్రత మనందరి బాధ్యత అంటూ మంత్రి తెలిపారు. బాధితుల కుటుంబాలకు అన్నిరకాలుగా న్యాయం జరగాలన్నారు. పని ప్రదేశాల్లో భద్రత చాలా ముఖ్యమని ఆమె వెల్లడించారు. అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.