Leading News Portal in Telugu

Be Alert On Seasonal Diseases: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.. ఆరోగ్యంతో చెలగాటమాడితే సస్పెండ్


  • సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం

  • డెంగ్యూ.. చికున్ గున్యా.. వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన

  • వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచన.
Be Alert On Seasonal Diseases: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.. ఆరోగ్యంతో చెలగాటమాడితే సస్పెండ్

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు. పని చేయని ఉద్యోగులను, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలని సీఎం హెచ్చరించారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, పలు గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. డెంగ్యూ, చికున్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలను గుర్తించాలని, అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.