- తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు
- జలమయమైన లోతట్టు ప్రాంతాలు
- తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

AP and Telangana Rains Live Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏపీలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని నిషేధం విధించారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
-
31 Aug 2024 03:39 PM (IST)
అత్యవసరం అయితేనే బయటకు రావాలి: మంత్రి గొట్టిపాటి రవి కుమార్
ఏపీలో వాయుగుండం ఎఫెక్ట్‌తో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సూచనలు చేశారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలని సూచించారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాపట్ల జిల్లాలో పరిస్థితిపై జిల్లా కలెక్టర్‌తో మంత్రి మాట్లాడారు.
-
31 Aug 2024 03:35 PM (IST)
కంభంలో కూలిన మట్టిమిద్దె.. తప్పిన పెను ప్రమాదం
ప్రకాశం జిల్లా కంభంలో ఓ మట్టిమిద్దె ముందు భాగం కూలింది. గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలతో ఈ ఘటన చోటుచేసుకుంది. మట్టిమిద్దె కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
-
31 Aug 2024 03:31 PM (IST)
భద్రాద్రి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల, ఆలపల్లి మండలాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుండాల మండలంలోని ఏడు మెలికల వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి.
-
31 Aug 2024 03:29 PM (IST)
జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి టెలీ కాన్ఫరెన్స్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలను అప్రమత్తం చేయాలని వారికి సూచించారు.
-
31 Aug 2024 03:24 PM (IST)
భారీ వర్షం దెబ్బకు వణికిపోతున్న గుంటూరు
భారీ వర్షం దెబ్బకు గుంటూరు జిల్లా వణికిపోతోంది. గ్రామాలు, పట్టణాలు, జాతీయ రహదారులు అన్న తేడా లేకుండా, వరదనీరు ముంచెత్తుతోంది. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం వరదలా మారి రోడ్లపైకి చేరింది. దీంతో అనేక వాహనాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి. కాజా టోల్‌గేట్ సర్వర్లు కూడా మొరాయించాయి. దీంతో టోల్‌గేట్ గేట్లను ఎత్తివేశారు అధికారులు.
-
31 Aug 2024 03:22 PM (IST)
భారీ వర్షానికి నీట మునిగిన పొలాలు
కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా పొలాలు నీటమునిగాయి. కృష్ణాజిల్లా ఆరుగొలనులో వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. నాట్లు వేసి 55 రోజులు అయిందని రైతులు వాపోతున్నారు. ఎకరానికి రూ.25 వేలు ఖర్చు అయిందని చెబుతున్నారు.
-
31 Aug 2024 03:20 PM (IST)
కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు.. పోర్టులో బియ్యం ఎగుమతులు నిలిపివేత
కాకినాడ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షం ప్రభావంతో ఈ రోజు, రేపు యాంకరేజ్ పోర్ట్ నుంచి రెండు రోజులు పాటు బియ్యం ఎగుమతులను పోర్ట్ అధికారులు నిలిపివేశారు. మత్స్యకారుల వేటను అధికారులు నిలిపివేయడంతో బోట్లు తీరానికే పరిమితమయ్యాయి. ఏలేరు, సుద్ద గడ్డ వాగు, పంపా రిజర్వాయర్, తాండవ నదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అత్యధికంగా శంఖవరం మండలంలో వర్షపాతం నమోదైంది.
-
31 Aug 2024 03:16 PM (IST)
చీరాలలో భారీ వర్షాలకు రోడ్లపై నిలిచిన నీరు
బాపట్ల జిల్లా చీరాలలో భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిలిచింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.