- హైడ్రా తరహాలో జిల్లాల్లో ఒక ప్రత్యేక వ్యవస్థ
- చెరువుల ఆక్రమణలపై రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్
- చెరువులను ఆక్రమించుకోవడం క్షమించరాని నేరమన్న సీఎం రేవంత్

CM Revanth Reddy: వరద ప్రమాద ప్రాంతాలు, ప్రమాదానికి కారణాలు, వాటిని ఎదుర్కొన్న తీరుపై బ్లూబుక్‌ను తయారు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వాటిని కలెక్టరేట్లలో ఉంచాలన్నారు. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలతో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అధిక వర్షపాతం నమోదైందని.. ఈ జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని తెలిపారు. వరంగల్‌పై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. రాంనగర్ నాలాపై అక్రమ కట్టడాలను తొలగించడంతో వరద ముంపు తప్పిందన్నారు. అధికారుల చర్యలతో ప్రాణనష్టం తగ్గించగలిగామని అభినందించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తామన్నారు. కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ఆస్తి, ప్రాణ నష్ట పరిశీలనకు ప్రధాని మోడీని ఆహ్వానించామన్నారు. తక్షణమే రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు కేటాయించాలని కోరారు.
ఇదిలా ఉండగా.. హైడ్రా తరహాలో జిల్లాలో ఒక వ్యవస్థను కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. చెరువులను ఆక్రమించుకోవడం క్షమించరాని నేరమన్నారు. చెరువుల ఆక్రమణలపైన రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. చెరువుల ఆక్రమణలో ఎంతటి వారున్నా వదిలి పెట్టమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చెరువుల ఆక్రమణకు సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, నాలాల ఆక్రమణల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారుల పైనా చర్యలు ఉంటాయన్నారు. చెరువుల ఆక్రమణల తొలగింపు ప్రత్యేక కార్యాచరణగా తీసుకుంటామన్నారు.