Leading News Portal in Telugu

Jishnu Dev Varma: ఖైరతాబాద్ బడా గణేష్కు గవర్నర్ ప్రత్యేక పూజలు..


  • ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ గవర్నర్

  • గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఉత్సవ సమితి సభ్యులు

  • అనంతరం భారీ గణనాథుడికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు .
Jishnu Dev Varma: ఖైరతాబాద్ బడా గణేష్కు గవర్నర్ ప్రత్యేక పూజలు..

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహం దగ్గరకు వచ్చిన గవర్నర్ కు ఉత్సవ సమితి సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత.. భారీ గణనాథుడికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, అందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్ధించినట్లు చెప్పారు.

మరోవైపు.. ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజలో పాల్గొన్నారు. రేవంత్‌కి పూర్ణకుంభం, మంగళ హారతులతో అర్చకులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహా గణపతికి గజమాల అందజేశారు. మహా గణపతి తొలిపూజలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత ఏడాది కూడా పీసీసీ అధ్యక్షుడుగా వచ్చానని.. ఈ ఏడాది ముఖ్యమంత్రి హోదాలో రావడం తొలిసారి అని అన్నారు. ఇక భవిష్యత్ లో కూడా మీ ఆహ్వానం మేరకు రావడానికి సంతోషిస్తున్నా అని తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 ఏళ్లుగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ధన్యవాదాలు తెలిపారు. నిష్టతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందన్నారు. గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం కోసం సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీని కూడా ఆహ్వానించామని, నగరంలో లక్షకు పైగా గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారని సీఎం తెలిపారు.