- ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ..
-
తాజాగా 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రావడంతో 34కు చేరిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య.. -
మెడికల్ కాలేజీల అనుమతులు లభించిన జిల్లాల ప్రజలకు శుభాకాంక్షలు..

Telangana Medical Colleges: ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావించింది. తాజాగా 4 మెడికల్ కాలేజీలకు అనుమతి రావడంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరింది. అయితే, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కానీ, 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏకంగా 29 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. 2014 నాటికి 850 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. నేడు 4090 సీట్లు ఉన్నాయి. ఏటా పది వేల మందికి పైగా డాక్టర్లను తయారు చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న కేసీఆర్ కల సాకారం నెరవేరినట్లైంది. ఇక, మెడికల్ కాలేజీల అనుమతులు లభించిన జిల్లాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభాకాంక్షలు తెలిపింది.
అయితే, తెలంగాణలో మరో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యాదాద్రి-భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, విద్య డైరెక్టరేట్ (డీఎంఈ)కు మంగళవారం ఎన్ఎంసీ తెలియజేసింది. దీంతో మరో 200 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లైంది. 2024-25 విద్యా సంవత్సరానికి కొత్తగా ఎనిమిది ప్రభుత్వ వైద్య కాలేజీలకు సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎన్ఎంసీకి ప్రతిపాదనలు పంపగా.. గత నెల ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేటకు పర్మిషన్ ఇవ్వగా మరో నాలుగింటిని రిజెక్ట్ చేసింది.
ఈ నేపథ్యంలో యాదాద్రి-భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ మెడికల్ కాలేజీల ప్రారంభానికి వీలుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వాటిలోని లోపాలు సరి చేసింది. అలాగే, ప్రధానంగా ఈ నాలుగు చోట్ల 220 పడకల ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఎన్ఎంసీ నిర్దేశించిన మేరకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. రెండు వారాల క్రితం మరోమారు అనుమతికి దరఖాస్తు చేయగా అన్ని అంశాలను పునఃపరిశీలించిన జాతీయ వైద్య మండలి ఆమోదం తెలిపింది.