ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగ లేఖ రాశారు. ‘అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేదల అభ్యున్నతే లక్ష్యంగా కొట్లాడే వ్యక్తిని నేను. హైడ్రాసంస్థకు, హైదరాబాద్ ముంపు గురికాకుండా చూసేందుకు, మూసీ ప్రక్షాళనకు, మూసీను కొబ్బరినీళ్లలా చేసేందుకు, ఎకలాజికల్ బాలన్స్ కాపాడడానికి, విదేశీ పక్షులు రావడానికి, చేపలు పెంచడానికి, పిల్లలు ఈతకొట్టేల చెరువులు తయారు చేయడానికి నేను వ్యతిరేకం కాదు. చెరువు కన్నతల్లి లాంటిది. కానీ హైదరాబాద్ లో ఉన్న ఏ చెరువు కూడా పక్షులు, చేపలకు నిలయంలా లేదు. కన్నతల్లి లాంటి ప్రేమను పంచి పాలలాంటి నీళ్లను ఇచ్చి జీవం పోసిన చెరువు ఇప్పుడు భూగర్భంలో విషాన్ని నింపుతుంది. దుర్వాసననిస్తుంది. చుట్టుపక్కల ప్రజల రోగాలకు నిలయమైంది. ముందు ఈ చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి. అది చేయకుండా 40 ఏళ్ళక్రితం ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో, ప్రభుత్వం అనుమతించిన లే అవుట్ లలో ఇల్లు కట్టుకున్న నిరుపేదప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ మీరు చేస్తున్న అడ్డగోలు కూల్చివేతలను వ్యతిరేకిస్తున్నాం. గొల్లున ఏడుస్తునా, కాళ్ళమీద పడ్డా వదిలిపెట్టలేదు. వారు కడుపుకాలి మాట్లాడుతున్నారు డబ్బులు ఇస్తే కాదు. పేదల చిరకాల స్వప్నం ఇళ్లు. దొంగలలాగా దాడి చేసి మీరు చేస్తున్న కూల్చివేతలు, ఇస్తున్న నోటీసులు ప్రజల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. చట్టప్రకారం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించండి. మీకేమీ అపరిమిత అధికారాలు లేవు అని గుర్తుచేస్తున్నా. పేదలను ఇబ్బంది పెట్టడానికి కాదు మీకు అధికారం ఇచ్చింది.
Kandula Durgesh: రుషికొండ పై టూరిజం మంత్రి కీలక వ్యాఖ్యలు..
పేదల పక్షాన కొట్లడడం నా కర్తవ్యం. పదేళ్ళున్న కేసీఆర్ మూసీ ప్రక్షాళన చేస్తానని చేయలేదు. మీరు మూసీ ప్రక్షాళన చేస్తానంటే అడ్డుకోము. పట్టాభూములను కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్న వారిని బఫర్ జోన్ పేరుతో అక్రమంగా కట్టుకొని ఉంటున్నారని చిత్రీకరించడం దుర్మార్గం. పిడికెడు అక్రమ ఇళ్లను బూచిగా చూపి కోట్ల విలువ చేసే ఇళ్లను కూలగొడుతున్నారు. RB-X అని రాస్తున్నారు. పనిగిరి కాలనీ, మారుతినగర్, చైతన్య పురి, ప్రజయ్ ఇంజనీరింగ్ సిండికేట్ లాంటి అపార్ట్మెంట్స్ అన్నీ తిరిగివచ్చాం. మేము ప్రజల మధ్య ఉన్నాం. మీకు తిరిగి చూసే టైం లేదు. తిరిగి చూసి.. వారి ఆక్రందనాలను ఆవిష్కరించే మమ్ముల్ని కాలకేయులుగా పోలుస్తున్నారు. ఇదేనా మీ భాష మీ సంస్కారం.
బ్యూటిఫికేశన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా ? మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? డీపీఆర్ ఉందా? ఇళ్ళు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి ? కోట్లవిలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎలా? సబర్మతి నది ప్రక్షాళనకి 2 వేల కోట్లు, నమోగంగ ప్రాజెక్ట్ కి 12 ఏళ్లలో 22వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు లక్షా 50 వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి. చెరువుల FTL, బఫర్ జోన్ నిర్ధారించకుండ కూల్చివేతలు ఎలా చేస్తారు. పట్టా భూముల్లో ఇళ్ళు కట్టుకున్నవారికి ప్రత్యామ్నాయం ఏం చూపిస్తారు ప్రకటించండి. మీరు చేస్తున్న పనులు హైదరాబాద్ భవిష్యత్తుని, అభివృద్ధిని ప్రశ్నార్థకంలో పడవేస్తున్నాయి.
స్టేజీలమీద ప్రకటనలు చేయడం కాకుండా.. నిర్ణయాధికారం ఉన్న ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం పెడితే మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధం. నా కొట్లాట రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న పేదల ఇళ్ళకోసం. మీరు లక్షన్నర కోట్లు పెట్టే ఖర్చు పేదల కోసమేనా ? అంత బడ్జెట్ మతలబు ఎంటో తేలాల్సిఉంది. ఈ విషయాలపై స్పష్టత వచ్చే వరకు నా ప్రతిఘటన ఉంటుంది. పదవి ఉన్నా లేకున్నా నేను ప్రజల పక్షాన ఉండేవాన్ని అని తెలంగాణ సమాజానికి తెలుసు.’ అని లేఖలో ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
Israel-Gaza War: గాజా నుంచి ఇజ్రాయిల్‌పై రాకెట్లు ప్రయోగించిన హమాస్..