Leading News Portal in Telugu

Deputy CM Bhatti Vikramarka Inaugurated Indira Dairy Logo in Madhira


  • మధిరలో ఇందిరా డెయిరీ లోగోను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రూపొందించామని వెల్లడి
Bhatti Vikramarka: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ఇందిరా డెయిరీ..

Bhatti Vikramarka: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా డెయిరీని రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో ఇందిరా డెయిరీ లోగో ఆవిష్కరణ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఉపముఖ్యమంత్రి మాట్లాడారు. మహిళా డెయిరీలో పాల విక్రయాలు, వెన్న పాల ఉత్పత్తి ద్వారా స్వయం సమృద్ధి జరుగుతుందన్నారు. మహిళా డెయిరీపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. మహిళలకు రుణాల పట్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. మహిళల పట్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.

మహిళా డెయిరీపై బీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డెయిరీ పట్ల వ్యవహరించిన వైఖరి సరైనది కాదన్నారు. మహిళా డెయిరీలో 61 వేల మంది సభ్యులతో 40 లక్షల డిపాజిట్స్ ఉన్నాయన్నారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే మహిళ డెయిరీపై దృష్టి సారించామన్నారు. మధిర నియోజకవర్గంలో రెండున్నర లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి జరుగుతుందన్నారు. ఏడాదిలో మహిళల ఆదాయం నెలకి 24 కోట్లు రూపాయలు పాల మీదనే సంపాదించవచ్చన్నారు. పాల ఉత్పత్తులన్నింటిని కలిపితే 500 కోట్లు సంపాదించవచ్చని పేర్కొన్నారు. ఇందిరా డెయిరీ ద్వారా దేశం మొత్తం మధిర వైపే చూడాలన్నారు. నియోజకవర్గంలో మూడు ఆనకట్టలు కట్టామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.