Leading News Portal in Telugu

Mother and Daughter Died in Fire Accident in Peddapalli District


  • పెద్దపల్లి జిల్లా రత్నాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని రాంనగర్‌లో ప్రమాదం
  • షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో చెలరేగిన మంటలు
  • నిద్రలోనే తల్లీకూతుళ్లు మృతి
Fire Accident: షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం.. నిద్రలోనే తల్లీకూతుళ్లు మృతి

Fire Accident: నిద్రలోనే తల్లి కూతుళ్లు మృతి చెందడం గ్రామంలో విషాదం నింపింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని రాంనగర్‌లోని గడ్డం కనకయ్య ఇంట్లో రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించి ఇద్దరు మహిళలు గుర్తుపట్టనంతగా కాలిపోయి మృతి చెందారు. కనకయ్య తన భార్య, అత్తతో కలిసి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరితోపాటు ఇంట్లో మూగజీవాలైన పెంపుడు కుక్క, ఒక కోడి కూడా చనిపోయాయి. గ్రామానికి చెందిన గడ్డం కొమురమ్మ (45), కల్వల పోచమ్మ (65) అనే ఇద్దరు తల్లి కూతుళ్ళు అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇళ్ళంతా మంటలు వ్యాపించి మృతి చెందినట్లు స్థానికులు, పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఇంట్లోని గృహపకరణాలు కూలరు, విద్యుత్ వైర్లు, కాలిపోయాయని ఏసీపీ రమేష్ తెలిపారు. గోదావరిఖని ఏసీపీ రమేష్, మంథని సీఐలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి పరిసరాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కనకయ్య పని నుండి రాత్రి తిరిగివచ్చి ప్రమాదం జరిగిన సమయంలో కొమరమ్మ భర్త ప్రమాదాన్ని చూసి భయపడి తన బావమరిదిని తీసుకొని వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో రెండు మూగజీవాలు బలి కావడంతో పశువైద్యాధికారులను కూడా సంప్రదిస్తామని ఏసీపీ తెలిపారు.