
TG Hostel Diet Charges : తెలంగాణ సర్కార్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్షేమ వసతి గృహాల్లో స్టూడెంట్లకు ప్రభుత్వం ఇచ్చే డైట్, కాస్మొటిక్ ఛార్జీలను భారీగా పెంచింది. రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, శాఖలకు చెందిన అనుబంధ హాస్టళ్లలో డైట్ ఛార్జీలు పెంచుతూ బుధవారం రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ప్రస్తుతం రూ.950గా ఉన్న డైట్ ఛార్జీలను రూ.1330కి పెంచారు. అలాగే 8 నుంచి 10వ తరగతి వరకు రూ.1100 నుంచి రూ.1540కు, ఇంటర్ నుంచి పీజీ వరకు డైట్ ఛార్జీలను రూ.1,500 నుంచి రూ.2,100కు పెంచారు. దీంతో పాటు 3 నుంచి 7వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.55గా ఉన్న కాస్మోటిక్ ఛార్జీలను రూ.175కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 8 నుంచి 10వ తరగతి వరకు కాస్మోటిక్ ఛార్జీలలను రూ.75 నుంచి రూ.275కి పెంచారు. తెలంగాణలోని సంక్షేమ హాస్టళ్లలో 7,65,700 మంది విద్యార్థులు ఉన్నారు.
ఏడాది కిందట ప్రజాప్రభుత్వం కొలువుదీరే సమయానికి రాష్ట్ర ఖజానా ఒట్టిపోయి ఉంది. ఇంకా చెప్పాలంటే ఖజనా లోటు రూ. 3 వేల కోట్లకు పైమాటే. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ప్రజలపై ఎక్కడా భారం వేయకుండా ఖజానాలో కాసుల వర్షం కురిసేలా చేస్తున్నారు. గ్యారంటీల అమలు ఒకవైపు.. సంక్షేమ, అభివృద్ధి మరోవైపుగా పరుగులు పెట్టిస్తున్నారు. సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డైట్ ఛార్జీలను పెంచింది. ఇన్నేళ్ల తరువాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే విద్యార్థులకు డైట్ ఛార్జీలను పెంచింది. రాష్ట్రంలోని 7,65,705 విద్యార్థులకు పెంచిన డైట్ ఛార్జీల వల్ల లబ్ధి చేకూరనుంది. పండుగ వేళ ఖజానాపై నెలకు రూ.300 కోట్లు భారం పడుతున్నా.. ఉద్యోగులకు 3.64 శాతం డీఏను ప్రభుత్వం ప్రకటించింది. గత పాలకులు ఇష్టారీతిన చేసిన అప్పులకు అసలు – వడ్డీనీ చెల్లిస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ.. అత్యంత క్రమశిక్షణతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.