Leading News Portal in Telugu

Congress Government Turned Ashok Nagar to Shok Nagar: Harish Rao


  • అ’శోక నగరాన్ని సందర్శించండి రాహుల్ గాంధీ..

  • విద్యార్థులతో మాట్లాడి వారి ఆవేదనను మీరు వినండి..

  • మీ ప్రజా ప్రభుత్వం స్టూడెంట్స్ పై కర్కశంగా వ్యవహరించింది: హరీశ్ రావు
Harish Rao: అ’శోక నగరాన్ని సందర్శించండి రాహుల్ గాంధీ..

Harish Rao: రాహుల్ గాంధీ మీరు ఎన్నికల ముందు అశోక్ నగర్‌లోని నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే.. మీ సో-కాల్డ్ ప్రజా పాలనలో విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించింది అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. లాఠీ చార్జ్ చేసి వీపులు పగలగొట్టింది.. ఈ దారుణాలు మీకు తెలుసా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు వస్తున్న మీరు ఒకసారి అశోక్ నగర్‌ని సందర్శించి ఆ విద్యార్థులతో మాట్లాడి, వారి ఆవేదనను వినండి, శోక నగర్‌గా మార్చిన మీ ప్రభుత్వ తీరును చూడండి అని ఆయన ఎద్దేవా చేశారు. మీరు వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాల్లో కనీసం 10 శాతం ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదన్నారు. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు.. ప్రక్షాళన సంగతి దేవుడెరుగు.. టీఎస్పీఎస్సీని టీజీపీఎస్‌గా పేరు మార్చి చేతులు దులుపుకున్నారు అని హరీశ్ రావు మండిపడ్డారు.

ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు.. కానీ అది కేవలం జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మిగిలిపోయింది అని హరీశ్ రావు విమర్శించారు. పది నెలల కాలంలో నిరుద్యోగ భృతి, 5 లక్షల రూపాయల యువ వికాసం పథకం లాంటి హామీల ఊసు కూడా లేదు.. నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల మీరు మీ పార్టీ చూపిన కపట ప్రేమ బట్టబయలైంది.. కాంగ్రెస్ ప్రభుత్వ కర్కశ పాలనను నిరుద్యోగ యువత తప్పకుండా గుర్తు పెట్టుకుంటుంది అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు.