ప్రభుత్వం అలా చేయడం వల్లే రైతులకు ఈ దుస్థితి.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్లే అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని కాపాడేందుకు వెళ్లి కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో రైతులు పిడుగుపడి మరణించడం బాధకరమని తెలిపారు. పిడుగుపాటుకు గురై మరణించిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పిడుగుపాటుతో మరణించిన రైతులకు కేంద్రం ఇచ్చే సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా సాయం చేసి ఆదుకోవాలని కోరారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల పంట నష్టాన్ని యుద్ధప్రాతిపదికన అంచనా వేసి నష్ట పరిహారాన్ని చెల్లించాలని తెలిపారు. గాయాలపాలైన రైతులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరారు.