కేంద్రానికి మంత్రి కేటీఆర్ కీలక సూచనలు
ప్రస్తుతం పెద్ద ఎత్తున పెరిగిన ఇంటర్నెట్ వినియోగం నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల వలన నూతన ఉపాధికి అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాల ఐటీ మంత్రులతో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న కేటీఆర్… కేంద్రానికి పలు సూచనలు చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు పలు మినహాయింపులను కేంద్రాన్ని కోరారు. వివిధ రంగాల కన్వర్జెన్స్ ద్వారా అనేక నూతన అవకాశాలు రానున్నాయని వివరించారు.
రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్స్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు కదలాలని సూచించారు. తెలంగాణకు మరో రెండు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను కేటాయించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి కేటీఆర్ సూచనలకు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సానుకూలంగా స్పందించారు.