Leading News Portal in Telugu

Heavy Rains: అగ్రరాజ్యం అమెరికాపై హరీకేన్‌ హిల్లరీ తుఫాన్ ఎఫెక్ట్


హరీకేన్‌ హిల్లరీ తుఫాను ప్రభావంతో అగ్రరాజ్యం అమెరికా రాష్ట్రాలు వణికిపోతున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఆ దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. భీకర గాలులతో కూడిన వర్షం పడటంతో పలు రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. తుఫాన్ తో దక్షిణ కాలిఫోర్నియాలోని చాలా ప్రాంతాల్లో కుండపోతగా వానాలు పడుతున్నాయి. దాదాపు 84 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని స్థానిక అధికారులు పేర్కొన్నారు. రేపు (మంగళవారం) పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు హెచ్చరించారు.

తుఫాన్ బీభత్సం సృష్టిస్తూ భారీ వర్షాలు కురుస్తుండటంతో నెవాడాలో అధికారులు ఎమర్జెన్సీ విధించారు. ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాలిఫోర్నియాలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. అసాధారణమైన వేసవి తుఫాన్ కు తోడు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవౌతున్నారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓజాయ్‌ నగరానికి ఈశాన్యాన నిన్న (ఆదివారం) మధ్యాహ్నం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.1గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే అధికారులు వెల్లడించారు.

భూమి అంతర్భాగంలో 4.8 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు తెలిపారు. లాస్‌ఏంజెల్స్‌ సమీపంలో కూడా 3.1, 3.6 తీవ్రతతో భూమి రెండు సార్లు కంపించినట్లు జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే, ప్రజలు భారీ వర్షాలు మరింత కురువనుండంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపారు.