ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా దేశంలో నిరుద్యోగంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంది. అక్కడ యువత జాబ్స్ దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఫ్రెషర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తాజాగా సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన జాంగ్ అనే అమ్మాయి జాబ్ కోసం వేల కొద్దీ రెజ్యూమ్‌లను చైనీస్ కంపెనీలకు పంపినప్పటికీ ఉద్యోగం దొరకలేదు. నెలల తరబడి సెర్చ్ చేసినా ఉద్యోగం దొరక్కపోవడంతో నిరాశ నిస్పృహలకు గురైన జాంగ్.. తాను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువత మానసిక స్థితి ఎలా ఉంటుందన్నదానిపై ఓ సర్వే నిర్వహించారు.
గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత యువతపై ఎంత మానసిక ఒత్తిడి ఉంటుందో తనకూ అనుభవంలోకి వచ్చినట్లు ఇటీవల బీజింగ్‌లో జరిగిన రిక్రూట్‌మెంట్ ఫెయిర్‌లో జాంగ్ వెల్లడించింది. తాను పంపే ప్రతి పది రెజ్యూమ్‌లకు ఒక స్పందన మాత్రమే వస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. యువతలో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతున్న టైంలో చైనా ఉద్యోగ మార్కెట్ లోకి ప్రవేశించిన మిలియన్ల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు.
16 నుంచి 24 ఏళ్ల వయసున్న యువతలో నిరుద్యోగం జూన్ నెలలో రికార్ట్ స్థాయిలో 21.3 శాతానికి చేరింది. చైనాలో నిరుద్యోగం పెరుగుతున్నట్లు ప్రపంచానికి తెలియకుండా వయసు ఆధారిత ఉపాధి డేటా ప్రచురణను అక్కడి అధికారులు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అనుభవం లేని అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడం సవాలుగా మారిందని బీజింగ్‌లో జరిగిన కెరీర్ ఫెయిర్‌లకు హాజరైన యువత వెల్లడించింది. దీంతో ఉద్యోగాలు దొరక్కపోవడంతో చైనా యువతకు ఎంత కష్టమొచ్చింది అని నెట్టింట చర్చించుకుంటున్నారు.