Leading News Portal in Telugu

Sheikh Mohammed bin Rashid: చంద్రయాన్-3 విజయవంతంపై దుబాయ్ రాజు అభినందనల వెల్లువ


చంద్రయాన్-3 విజయవంతం కావడంపై ప్రపంచ దేశాలు ఇండియాకు సలాం కొడుతున్నాయి. రోదసిలో ఇప్పటివరకు ఏ దేశం అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇస్రో (ISRO) విజయవంతంగా చేరుకుంది. దీంతో భారత్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మన దేశం నుంచి కాకుండా.. ఇతర దేశాల నుంచి అభినందనలు తెలియజేస్తున్నారు.

మరోవైపు చంద్రయాన్-3 విజయవంతంపై యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అభినందనలు తెలిపారు. చంద్రుడిపై విజయవంతంగా దిగినందుకు భారత్ లోని తమ మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. పట్టుదలతోనే దేశాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. భారత్ చరిత్రను సృష్టిస్తూనే ఉందని X (ట్విట్టర్) లో తెలిపారు.

మరోవైపు నేపాల్ ప్రధాని ప్రచండ కూడా భారత ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేశారు. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చారిత్రక విజయాన్ని సాధించినందుకు ప్రధాని మోడీని, ఇస్రో బృందాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. ఇస్రో విజయం యావత్ మానవాళికి దక్కిన విజయమని మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ అభినందించారు. పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగిడే క్షణం భారతీయులకే కాదు మొత్తం మానవాళికే చారిత్రాత్మక క్షణమని పేర్కొన్నారు.