Leading News Portal in Telugu

Artificial Intelligence: ఏఐతో ఉద్యోగావకాశాలు.. బాధ్యతాయుతంగా వ్యవహారించాలంటున్న టెక్‌ దిగ్గజాలు


Artificial Intelligence: ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్ కుదిపేస్తోంది. ఏఐ అనేది సరికొత్త టెక్నాలజీ. అత్యాధునిక టెక్నాలజీ. దీనితో ఏదైనా చేయవచ్చు. అటువంటి ఆధునిక టెక్నాలజీతో ఉపయోగాలతోపాటు.. నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు అయితే ఏఐతో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఉంటున్నాయని.. వాటిని బాధ్యతాయుతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఐటీ కంపెనీల యజమానులు.. ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఏఐతో బాధ్యతాయుతంగా లేకపోతే తీవ్ర నష్టాలు ఉంటాయని చెబుతున్నారు. ఏఐ వల్ల ఉత్పాదకతతో పాటు ఉద్యోగావకాశాలలూ పెరుగుతాయంటున్న ఐటీ కంపెనీల అధిపతులు.. ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఏఐ వల్ల ప్రయోజనాలు, నష్ట భయాలపై సీఐఐ ఆధ్వర్యంలో ‘బీ20 సమ్మిట్‌ ఇండియా 2023 జరిగింది. ఈ సమ్మిట్‌లో పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు పాల్గొన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా పాల్గొన్నారు.

సమ్మిట్‌లో ఐబీఎమ్‌ ఛైర్మన్‌, సీఈఓ అరవింద్‌ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐ వల్ల వ్యాపార వ్యయాలు తగ్గుతాయని.. కోడింగ్‌ 60 శాతం మెరుగుపడుతుందన్నారు. ఐబీఎమ్‌ విషయానికే వస్తే మొత్తం కార్యకలాపాల్లో 20 శాతంతక్కువ స్థాయి అవగాహనతో చేసే పని ఉంటుందని.. ఇందులో 30 శాతాన్ని ఏఐ ద్వారా చేయగలుగుతున్నామన్నారు. తద్వారా క్లయింట్లకు తక్కువ వ్యయాలతో పని పూర్తి చేయొచ్చని.. ఈ విభాగాల్లోని ఉద్యోగులను ఇతర పనులకు వినియోగించుకోవచ్చని అంటున్నారు. ఇప్పుడైనా, భవిష్యత్‌లోనైనా అధిక అవగాహనతో చేసే పనులను మానవులే చేయాలన్నారు. టీసీఎస్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ మార్పు కనిపించిందని.. తదుపరి ఏఐ వంతు వచ్చిందని తెలిపారు. మనదేశంతో పాటు ప్రపంచ దక్షిణ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్న ప్రజలకు సేవలు అందించడంలో చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. 30 కోట్ల మందికి ఆరోగ్య సంరక్షణ, విద్యా సేవలు అందడం లేదు. కొన్నేళ్ల క్రితం బ్యాంకింగ్‌ సేవలూ అందుబాటులో ఉండేవి కాదు. మరో వైపు ఏటా కోటి నుంచి 1.2 కోట్ల మంది ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు సమస్యలనూ తీర్చాలంటే.. సాంకేతికతను ముఖ్యంగా ఏఐను అందిపుచ్చుకోవాల్సిందేనని చంద్రశేఖరన్‌ చెప్పారు. తక్కువ నైపుణ్యం ఉన్నవారు సైతం ఏఐతో అద్భుత నిపుణులుగా మారగలరని.. ఇండియాలో మరిన్ని ఉద్యోగాలకు ఏఐ దోహదం చేయగలదని ఆయన తెలిపారు.