Leading News Portal in Telugu

Yevgeny Prigozhin: విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ మృతి.. జన్యు పరీక్ష ద్వారా నిర్ధారణ


Yevgeny Prigozhin: ఆగస్టు 23న రష్యాలో ఓ ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారు. ఈ సమయంలో వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ కూడా ఈ విమానంలో ఉన్నారని తెలిసింది. యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారని కూడా తెలిసింది. ప్రిగోజిన్‌ విమానం కూలిపోవడానికి కారణమేమిటనే దానిపై ప్రశ్నలు పెరుగుతూనే ఉన్నాయి. మాస్కో సైనిక నాయకత్వానికి వ్యతిరేకంగా వాగ్నర్ తిరుగుబాటు చేసిన సరిగ్గా రెండు నెలల తర్వాత ఈ సంఘటన జరగడంతో, క్రాష్‌లో క్రెమ్లిన్ ప్రమేయం ఉండవచ్చనే ఊహాగానాలు విస్తృతంగా పెరిగిపోయాయి. అయితే, ఇప్పుడు రష్యా యెవ్జెనీ ప్రిగోజిన్ మరణాన్ని ధృవీకరించింది. వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలోనే మరణించారని, ఇది జన్యు పరీక్ష ద్వారా ధృవీకరించబడిందని రష్యా తెలిపింది. వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ గత వారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు జన్యు పరీక్షలు నిర్ధారించాయని రష్యా పరిశోధకులు ఆదివారం తెలిపారు. ఈ విమానంలో 10 మంది ఉన్నారని, వారు ప్రమాదంలో మరణించారని రష్యా చెప్పింది.

అంతకుముందు, రష్యాకు చెందిన ఏవియేషన్ ఏజెన్సీ ప్రైవేట్ జెట్‌లోని వ్యక్తులందరి పేర్లను పంచుకుంది. యెవ్జెనీ ప్రిగోజిన్ కూడా విమానంలో ఉన్నారని విమానయాన సంస్థ తెలిపింది. ట్వెర్ ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదంపై జన్యు పరీక్షలు పూర్తయినట్లు రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. జన్యు పరీక్ష ఫలితాల ప్రకారం మరణించిన 10 మందిని గుర్తించినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో మరణించిన యెవ్జెనీ ప్రిగోజిన్ కూడా విమానంలో ఉన్నారని ఈ పరీక్షలో తేలిందని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ప్రతినిధి స్వెత్లానా పెట్రెంకో తెలిపారు. అయితే విమానం కూలిపోవడానికి గల కారణాలను రష్యా అధికారులు వెల్లడించలేదు. యెవ్జెనీ ప్రిగోజిన్ రెండు నెలల క్రితం పుతిన్‌పై తిరుగుబాటు చేశారని తెలిసింద. ఈ తిరుగుబాటు జరిగిన రెండు నెలల తర్వాత ఈ సంఘటన జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జూన్ 23-24 తిరుగుబాటును వెన్నుపోటుతో పోల్చారు.

ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పుతిన్ తన సంతాపాన్ని కూడా వ్యక్తం చేశారు. అదే సమయంలో, పుతిన్ ఆదేశాల మేరకే ప్రిగోజిన్ హత్యకు గురయ్యాడని పాశ్చాత్య దేశాల నాయకులు పేర్కొన్నారు. అదే సమయంలో, క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పాశ్చాత్య దేశాల నాయకుల ఆరోపణలను తప్పు అని పేర్కొన్నారు.