Leading News Portal in Telugu

Putin Dials PM Modi: ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్‌.. ఏం చెప్పారంటే?


Putin Dials PM Modi: భారత్‌లో జీ20 సమ్మిట్‌ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రధాని మోడీకి ఫోన్‌ చేసినట్లు తెలిసింది. న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు తాను భారత్‌కు రాలేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి తెలిపారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరిగే సదస్సులో రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ పాల్గొంటారని పుతిన్ తెలిపారు. రష్యా నిర్ణయంపై, భారత్‌ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సమ్మిట్‌ కార్యక్రమాలకు రష్యా మద్దతు ఇచ్చినందురు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు.

ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై పురోగతిని సమీక్షించారు. గత వారం దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పరస్పరం మాట్లాడిన నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యల గురించి కూడా మాట్లాడారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇరువురు నేతలు టచ్‌లో ఉండేందుకు అంగీకరించారని ప్రధాని కార్యాలయం తెలిపింది.

వ్లాదిమిర్ పుతిన్‌ ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడ్డాడని అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC) వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో విదేశాలకు వెళ్లినప్పుడు పుతిన్‌ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్లే దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశాలకు పుతిన్‌ హాజరు కాలేదు. ఎందుకంటే ఐసీసీలో దక్షిణాఫ్రికా సభ్యదేశంగా ఉంది. దక్షిణాఫ్రికాకు వెళ్తే పుతిన్‌ అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆయన వీడియో లింక్‌ ద్వారా బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్నారు.