Leading News Portal in Telugu

Worm in Woman’s Brain: మహిళ మెదడులో పరాన్నజీవి.. ప్రపంచంలో తొలి కేసు


Worm in Woman’s Brain: వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఓ విచిత్రమై కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ మెదడులో ఏకంగా 3 అంగుళాల పరాన్నజీవిని వైద్యులు బయటకు తీశారు. మెదడులో పరాన్న జీవి రౌండ్ వార్మ్‌ను చూసి డాక్టర్లే ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలోనే ఈ తరహా కేసు మొదటిదని చెబుతున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ కేసును నివేదించింది.

ఆస్ట్రేలియాకు చెందిన 64 ఏళ్ల ఓ మహిళ గత రెండేళ్లుగా న్యూమోనియా, కడుపునొప్పి, డయేరియా, పొడిదగ్గు, జ్వరం, రాత్రిలో చమటలు పట్టడం, నిరాశ, జ్ఞాపకశక్తి లోపాలతో సహా అనేక లక్షణాలతో బాధపడుతోంది. వీటి కోసం చికిత్స తీసుకుంటోంది. 2022లో ఆమె పరిస్థితి మరింత దిగజారడంతో వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 3 అంగుళాలు అంటే 8 సెంటీమీటర్ల వానపాము లాంటి రౌండ్ వార్మ్ ఉందని గుర్తించారు. కాన్‌బెర్రాలోని ఇన్పెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ సంజయ్ సేనానాయకే ఈ విషయాన్ని వివరించారు.

శస్త్రచికిత్స చేసిన వైద్యులు రౌండ్ వార్మ్ పరాన్నజీవిని మెదడు నుంచి తొలగించారు. దీని శాస్త్రీయనామం ఓఫిడాస్కారిస్ రాబర్ట్సీ. సాధారణంగా ఈ రకం రౌండ్ వార్మ్ పాములతో సంబంధం కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇండోనేషియా, పాపువా న్యూగినియా వంటి ప్రాంతాలకు చెంది కార్పెట్ ఫైథాన్ పాముల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ బాధిత మహిళకు ఎలాంటి పాములతో ప్రత్యక్ష సంబంధం లేదు, అయితే పాముల జనాభా ఎక్కువగా ఉండే సరస్సు సమీపంలో నివసించింది. అయితే వంట కోసం సేకరించే న్యూజిలాండ్ బచ్చలికూర వంటి ఆకుకూరల్లో ఉండే పురుగు గుడ్లను తినడం ద్వారా ఈ సమస్య వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్ఫెక్షన్ మానవుల మధ్య వ్యాపించనప్పటికీ.. వన్య ప్రాణుల నుంచి మాననుల్లోకి ప్రవేశించే అవకాశాలు పెరుగుతున్నాయని, ఇవి జనోటిక్ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణం అవుతున్నాయని సేనానాయకే చెబుతన్నారు. పాములు, పరాన్న జీవుల కారణంగా భవిష్యత్తులో ఈ రకమైన కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.