Leading News Portal in Telugu

Donald Trump: వైస్ ప్రెసిడెంట్ పదవిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. “వివేక్ రామస్వామి”పై ప్రశంసలు..


Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో ప్రధాన పార్టీలైన డెమెక్రాట్లు, రిపబ్లికన్ పార్టీల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిత్వం కోసం పోటీ నెలకొంది. ముఖ్యంగా ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీలో డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే భారతీయ అమెరికన్ వివేక రామస్వామి కూడా ఈ సారి రిపబ్లికన్ పార్టీ తరుపున ప్రెసిడెంట్ పోటీలో ఉన్నారు.

ఇదిలా ఉంటే మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, వివేక్ రామస్వామిపై ప్రసంశల వర్షం కురిపించారు. ఆయన చాలా మంచి వ్యక్తని, వివేక్ రామస్వామి వైస్ ప్రెసిడెంట్ పదవి చాలా మంచి అభ్యర్థి అని అన్నారు. ఆయనకు మంచి శక్తి ఉందని, తెలివైన వ్యక్తని, తనకంటూ ప్రత్యేకతను కలిగి ఉన్నాడంటూ ట్రంప్ కొనియాడారు.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎవరిని ఎంచుకోవచ్చనే ఊహాగానాలు కొనసాగుతున్న క్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ట్రంప్ ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు ఇటీవల జరిగిన రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో రామస్వామి ట్రంప్‌ను “21వ శతాబ్దపు ఉత్తమ అధ్యక్షుడు” అని పేర్కొన్నారు. దీనిపై ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్ లో మాట్లాడుతూ.. ఓ తరంలో తానే అత్యుత్తమ ప్రెసిడెంట్ అని ఎవరైనా వ్యాఖ్యానిస్తే వారిని నేను ఇష్టపడాలని అన్నారు.

ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్ ముందుండగా.. 8 ఏళ్ల మల్టీ మిలియనీర్ మరియు మాజీ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ రామస్వామిని మూడవ స్థానంలో నిలిపాయి. రామస్వామికి ట్రంప్ మద్దతు ప్రకటించడం అతని అధ్యక్ష ఎన్నికకు గణమైన ప్రచారాన్ని తీసుకువస్తుందని అంతా భావిస్తున్నారు.