Leading News Portal in Telugu

G20 Summit: పుతిన్ తర్వాత.. జీ20 సమ్మిట్‌కు జిన్‌పింగ్ డుమ్మా..!


G20 Summit: జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ముస్తాబవుతోంది. ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. జీ20 దేశాధినేతలతో పాటు మరో 9 ఆహ్వానిత దేశాల అధినేతలు, అధికారులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా పుతిన్ పూర్తిగా సొంత దేశానికే పరిమితమయ్యారు. ఈ సమావేశాలకు పుతిన్ రావడం లేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ కూడా ఈ సమావేశాలకు గైర్హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పలు రిపోర్టులు వస్తున్నాయి. అయతే దీనిపై ఇటు చైనా విదేశాంగ అధికారులు కానీ, విదేశాంగ అధికారులు కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సమావేశానికి వస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వాణిజ్యంగా, భౌగోళిక పరంగా అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రెండు దేశాధినేతలు జీ20 వేదికగా సమావేశమవుతారని అంతా అనుకున్నారు. చివరిసారిగా గతేడాది ఇండోనేషియా బాలిలో జరిగిన జి20 సమావేశాల్లో బైడెన్, జిన్ పింగ్ సమావేశమయ్యారు.

ఇప్పటికే రష్యా అధినేత పుతిన్ రావడం లేదని చెప్పారు, తన స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వస్తున్నట్లు తెలిపారు. జిన్ పింగ్ స్థానంలో చైనా ప్రధాని వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే జీ20 సమావేశాలకు ముందు చైనా విడుదల చేసిన మ్యాపులు భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతను పెంచాయి. భారత అంతర్భాగాలైన అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ చైనా తన భూభాగాలుగా పేర్కొంటూ మ్యాపులను విడుదల చేయడంతో వివాదం మొదలైంది. అయితే ప్రస్తుతం ఏ కారణాల వల్ల జిన్ పింగ్ హాజరు కావడం లేదనే విషయం తెలియదు.