Leading News Portal in Telugu

Rishi Sunak: రిషి సునాక్ కీలక ప్రకటన.. భారత్‌తో కలిసి పని చేస్తాం


సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరుగనున్న G-20 సదస్సుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 భారతదేశానికి గొప్ప సంవత్సరం అని అన్నారు. భారతదేశం ప్రపంచ నాయకత్వాన్ని చూపడం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. G20 శిఖరాగ్ర సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. భారతదేశం యొక్క స్థాయి, వైవిధ్యం మరియు అసాధారణ విజయాలు G20 అధ్యక్షతన సరైన సమయంలో సరైన దేశం నిర్వహిస్తోందని తెలిపారు. G20 సదస్సును విజయవంతం చేయడంలో UK మద్దతు ఇస్తుందని రిషి సునాక్ పేర్కొన్నారు.

అంతేకాకుండా.. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి జీ-20 అధ్యక్షుడిగా భారత్‌తో కలిసి పని చేస్తామని బ్రిటన్ ప్రధాని చెప్పారు. ఇండియా 10 సంవత్సరాలలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. మరోవైపు ప్రధాని మోడీతో తన భేటీలో ప్రపంచ సవాళ్ల గురించి, వాటిని ఎదుర్కోవడంలో బ్రిటన్‌, భారత్‌ల పెద్ద పాత్ర గురించి మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. తాను ప్రధానమంత్రి కావడం పట్ల భారత ప్రజలు అపూర్వస్పందన చూపించారన్నారు. భారత్‌తో సంబంధాల పట్ల చాలా గర్వంగా ఉందని రిషి సునాక్ తెలిపారు. తన భార్య భారతీయురాలు అని గర్వించదగిన హిందువుగా భారతదేశ ప్రజలతో ఎల్లప్పుడూ అనుబంధాన్ని కలిగి ఉంటానన్నారు.

మరోవైపు ఖలిస్తానీ మద్దతుదారుల కార్యకలాపాలపై భారతదేశంలో పెరుగుతున్న ఆందోళనలపై బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ కీలక ప్రకటన చేశారు. ఖలిస్థాన్ అనుకూల ఛాందసవాదాన్ని ఎదుర్కోవడానికి బ్రిటన్.. భారత ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేస్తోందని తెలిపారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషి సునాక్ మాట్లాడుతూ.., బ్రిటన్‌లో ఏ విధమైన ఛాందసవాదం ఆమోదయోగ్యం కాదని అన్నారు.