Vivek Ramaswamy: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ తీవ్రంగా ఉంది. వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ లాంటి భారతీయ అమెరికన్లు అధ్యక్ష రేసులో ఉన్నారు. అయితే వివేక్ రామస్వామి అమెరికన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా సంచలన ప్రకటన చేశారు. 2020లో ట్రంప్ ఓడిపోయిన సమయంలో యూఎస్ క్యాపిటల్ పై దాడి చేసిన వారందరికి క్షమాభిక్ష ప్రసాదిస్తానంటూ హామీ ఇచ్చారు.
యాంటిఫా, బ్లాక్ లీవ్స్ మ్యాటర్(బీఎల్ఎం)లో పాల్గొన్న దుండగులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని..జనవరి 6 ఆందోళనకారులు మాత్రం ఇప్పటికీ జైలులో బెయిల్ లేకుండా మగ్గుతున్నారన అన్నారు. బైడెన్ ఆధీనంలోని ‘ ఇన్జస్టిస్’ విభాగం జనవరి 6 ఆందోళనకారులు శాంతియుతంగా చేసిన 1000 మంది నిరసనకారులను అరెస్ట్ చేసిందని అన్నారు. మన న్యాయవ్యవస్థపై చీకట్లు అలుముకున్నాయని అన్నారు.
నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీచ్చేందుకు, రాజకీయ కక్షతో కేసులు ఎదుర్కొంటున్న, చట్టపరమైన హక్కులకు దూరమైన అమెరికన్లకు క్షమాభిక్ష ప్రసాదిస్తాను అని అన్నారు. అమెరికా పోలీస్ శక్తి దుర్వినియోగాన్ని తాను పూర్తిగా నిర్మూలిస్తానని వాగ్ధానం చేశారు. ఒకవేళ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకుంటే తాను ఆయనకు ఓటు వేస్తానని రామస్వామి గతంలో వ్యాఖ్యానించారు. ఈ దశాబ్ధంలో అత్యుత్తమమైన ప్రెసిడెంట్ ట్రంప్ అంటూ ప్రశంసలు గుప్పించారు.
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి అనంతరం ఆయన మద్దతుదారులు జనవరి 6న యూఎస్ క్యాపిటల్ ముందు నిరసన తెలిపారు. దాడికి పాల్పడ్డారు. ట్రంప్ కావాలనే వారిని రెచ్చగొట్టారని డెమోక్రాట్లు విమర్శించారు. ఈ అల్లర్లలో పాల్గొన్నవారంతా కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం రిపబ్లిక్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిత్వ పోరులో ట్రంప్ 68 శాతం మద్దతుతో మొదటి స్థానంలో ఉండగా.. వివేక్ రామస్వామి 15 శాతం మద్దతుతో రెండోస్థానంలో ఉన్నారు.