G20 Summit: దేశ రాజధానిలో జరగనున్న జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ప్రపంచంలోని పలు దేశాధినేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో 40 మంది ప్రపంచ చేశాలకు చెందిన ప్రతినిధులు, ఆయా దేశాల అధినేతలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.
జీ 20 సమ్మిట్ నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు ఈ నెల 8 నుండి 10వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మీడియాతో విమానంలో మాట్లాడారు. తనకు ఇష్టమైన ఇండియాకు రావడం సంతోషాన్ని కల్గిస్తుందన్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వెంట ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షత మూర్తి కూడా ఉన్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారత ప్రధాని మోడీతో ధ్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను స్థిరికరించడం, అంతర్జాతీయ సంబంధాలను నిర్మించడం వంటి అంశాలపై కేంద్రీకరించనున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. యూకే ఇమ్మిగ్రేషన్ పాలసీలో ఎలాంటి మార్పులు ఉండవని బ్రిటన్ తేల్చి చెప్పింది. ఈ ఏడాది మేలో జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన జీ7 సదస్సులో మోడీ, సునాక్‌లు కలిశారు.
రిషి సునాక్ కంటే ముందుగానే పలువురు దేశాల నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్మన్ అజాలి అసోమాని G20 సమ్మిట్ కోసం ఢిల్లీకి చేరుకున్నారు. రైల్వే, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఆయనకు స్వాగతం పలికారు. జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి స్వాగతం పలికేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో సాంస్కృతిక నృత్యాన్ని ప్రదర్శించారు. అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ pr20 సమ్మిట్ కోసం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉక్కు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అల్బెర్టో ఫెర్నాండెజ్ ఢిల్లీలోని ఏరోసిటీలోని ఓ హోటల్‌కు చేరుకున్నారు
ఇదిలా ఉండగా.. ప్రపంచ నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ 15కి పైగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 8న ప్రధాని మారిషస్, బంగ్లాదేశ్, అమెరికా నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 9న జీ20 సమావేశాలు కాకుండా ప్రధానమంత్రి యూకే, జపాన్, జర్మనీ, ఇటలీలతో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 10న ప్రధాని మోడీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో వర్కింగ్ లంచ్ మీటింగ్‌ను కలిగి ఉంటారు. అనంతరం ప్రధాని కెనడాతో విడిగా సమావేశం, కొమొరోస్, టర్కీ, యూఏఈ, దక్షిణ కొరియా, EU/EC, బ్రెజిల్, నైజీరియాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. పలు వర్గాల ద్వారా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది.