United Nations: న్యూ ఢిల్లీ అన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత ఐక్యరాజ్యసమితి యూఎన్ రికార్డులలో ఇండియా పేరును భారత్‌గా మారుస్తుందని గ్లోబల్ బాడీ ప్రతినిధి ఈరోజు వెల్లడించారు. ఇండియా పేరు మార్చడానికి లాంఛనాలను పూర్తి చేసినప్పుడు వారు మాకు తెలియజేస్తారని.. ఆ సమయంలో యూఎన్ రికార్డుల్లోని పేరు మారుస్తామని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రధాన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ చెప్పారు.
జీ 20 దేశాధినేతలకు పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడంతో దేశంలో చెలరేగిన రాజకీయ దుమారం కొనసాగుతుండగానే మరో వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని ముద్రించి ఉన్న ప్రకటనను విడుదల చేయడం తాజాగా మరో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే రానున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. ఏసియన్ ఇండియా సమ్మిట్, ఈస్ట్ ఏసియా సమ్మిట్‌లకు ప్రధానమంత్రి హాజరు కానున్న వేళ.. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరుతో విడుదల చేసిన ప్రకటనలు మరోసారి దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రధాన ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం.. ఇండియా అనే పేరును భారత్‌గా మారబోతోందన్న ఊహాగానాలపై విస్త్రృత స్థాయిలో చర్చ నడుస్తున్న వేళ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ప్రధాన ప్రతినిధి స్పందించారు. అలాంటి విజ్ఞప్తి ఏదైనా తమ దాకా వస్తే.. తప్పకుండా పరిశీలిస్తామని తెలిపారు. ఇండియాలో ఫార్మాలిటీలు పూర్తియిన తర్వాత తమకు విజ్ఞప్తి చేస్తే యూఎన్ రికార్డులో పేరును మారుస్తామన్నారు.