G20 Summit: దేశరాజధాని ఢిల్లీలో జరగనున్న జీ-20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న అమెరికా ప్రెసిడెంట్‌కు విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఘన స్వాగతం పలికారు. తొలిసారిగా భారత్‌కు వచ్చిన బైడెన్‌కు ప్రధానికి అరుదైన గౌరవాన్ని ఇవ్వనున్నారు. ప్రధాని మోడీ నివాసంలో అమెరికా అధ్యక్షుడికి ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ప్రధాన మంత్రి మోడీ నివాసానికి బయలుదేరారు. ఇప్పటివరకు ప్రధానిగా ఏ దేశ అధ్యక్షుడికీ, ఏ దేశ ప్రధానికీ తన నివాసంలో ప్రధాని మోడీ విందు ఇవ్వలేదు. తొలిసారిగా జో బైడెన్‌కు ఆ గౌరవం లభించింది. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ ద్వైపాక్షిక చర్చలో కీలక అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోడీ కీలక చర్చలు జరపనున్నారు. భారత్‌లో జెట్ ఇంజిన్‌లను సంయుక్తంగా తయారు చేసే ఒప్పందంపై పురోగతి, MQ-9B సాయుధ డ్రోన్‌ల కొనుగోలు, పౌర అణు బాధ్యత, వాణిజ్యంపై ఒప్పందం లాంటి అంశాలపై ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఒక రోజు ముందు మాత్రమే జో బైడెన్ భారతదేశానికి రావడంతో తదుపరి చర్చలు, కొన్ని ఒప్పందాలు వచ్చే జనవరిలో ఉండే అవకాశం ఉంది. జనవరి 26, లేదా ఒక రోజు ముందు ముఖ్య అతిధులుగా వచ్చే నాయకులతో “క్వాడ్ లీడర్స్ సమ్మిట్”ను నిర్వహించాలని భారతదేశం ఆలోచిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. “ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ” (iCET) కింద హై టెక్నాలజీ సహకారం పై ఇరు దేశాధినేతల సమీక్ష నిర్వహించనున్నారు.
ఉక్రెయిన్‌లోని పరిస్థితులు, అమెరికా-చైనా సంబంధాలు, భారత్-చైనా సంబంధాలు, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి ఉన్న పరిస్థితులపై ఇరువురు నేతలూ చర్చించే అవకాశం ఉంది. భారతదేశం-యూఎస్. అణు ఒప్పందం, “పౌర అణు బాధ్యత” ఒప్పందంతో పాటు కొత్త పెట్టుబడులపై ప్రకటనలు కూడా చర్చించబడతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో భారత్ పై ఉన్న ఆరు కేసులను అమెరికా ఉపసంహరించుకున్నందున, కొన్ని అమెరికా ఉత్పత్తులపై సుంకాల పెంపుదలని తగ్గించడానికి భారత్ ముందుకొచ్చినందున, అత్యుత్తమ వాణిజ్య సమస్యలపై నేతలు చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేకించి, మే 2022లో ప్రారంభించిన “ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫోరమ్ ట్రేడ్” లో భారతదేశం చేరాలని బైడెన్ కోరనున్నట్లు సమాచారం.