Leading News Portal in Telugu

Robot Dog: రోబోటిక్‌ కుక్క.. చేస్తున్న పనులను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!


Robot Dog: ప్రస్తుతం సాంకేతికత రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక రోబోలు పుట్టుకొచ్చాయి. మానవుడు చేయలేని ఎన్నో పనులను రోబోలు అలవోకగా చేయగలవు. లండన్‌లోని హీత్రో విమానాశ్రయం ప్రధాన నిర్మాణ ప్రాజెక్టులపై సామర్థ్యాన్ని, భద్రతను మెరుగుపరిచే ప్రయత్నంలో కుక్క ఆకారంలో నాలుగు కాళ్లతో ఉండే ‘డేవ్’ అనే రోబోటిక్ కుక్కను నియమించింది. ఎయిర్‌పోర్టులోని కార్గో టన్నెల్స్‌లో నిర్మాణాత్మక ప్రాజెక్ట్‌లో రోబోట్ డాగ్ ‘డేవ్’ సహాయం చేస్తోంది. డేవ్ రోబోట్ డాగ్‌ను నిర్మాణ సంస్థ ‘మేస్’ ఉపయోగిస్తోంది. ప్రమాదకరమైన, చేరుకోలేని ప్రదేశాల నుంచి తాజా లైవ్ డేటాను సేకరిస్తుంది. డేవ్ డాగ్ అద్భుతమైన ఆవిష్కరణ అని హీత్రో విమానాశ్రయ సీవోవో ఎమ్మా గిల్తోర్ప్ అన్నారు.

డేవ్ ఒక అమెరికన్ ఇంజనీరింగ్, రోబోటిక్ కంపెనీ అయిన బోస్టన్ డైనమిక్స్ చేత అభివృద్ధి చేయబడిన రోబోట్. నిర్మాణ సంస్థ ‘మేస్’ భాగస్వామ్యంతో ట్రయల్ చేయబడుతోంది. హీత్రూ విమానాశ్రయంలో 1960 నాటి కార్గో టన్నెల్ పునరుద్ధరణ పనులలో 3డీ లేజర్ స్కాన్‌లను అందించడం డేవ్ పాత్ర. యూకేలో ఈ సాంకేతికతను అవలంబించిన మొదటి నిర్మాణ సంస్థల్లో ‘మేస్’ ఒకటి. ఈ ట్రయల్ విజయవంతమైందని భావించినట్లయితే, కంపెనీ యూకే చుట్టూ ఉన్న ఇతర ప్రధాన నిర్మాణ ప్రాజెక్టులలో సాంకేతికతను విస్తరించడానికి చూస్తోంది.