G20 Summit: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహిస్తోంది. భారత్ ఇస్తున్న ఆతిథ్యానికి ప్రపంచ దేశాధినేతలు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే భారత్ జీ20 నిర్వహిస్తుండటంపై డ్రాగన్ కంట్రీ చైనా తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. తాజాగా మరోసారి భారతదేశంపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా థింక్ ట్యాంక్ భారతదేశం తన సొంత ఎజెండాను ప్రచారం చేయడానికి, చైనా ప్రయోజనాలకు భంగం కలిగించడానికి జీ20 అధ్యక్ష పదవిని ఉపయోగించుకుంటోందని ఆరోపించింది.
చైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ భారతదేశంలో జీ20 సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. భారతదేశం భౌగోళిక రాజకీయ విషయాలను ప్రపంచవేదికపైకి తీసుకువస్తోందని ఆరోపించింది. జీ20 అతిథ్యదేశంగా తన బాధ్యతలను నెరవేర్చడమే కాకుండా మరన్ని సమస్యలను సృష్టిస్తోందని పేర్కొంది. అంతకుముందు భారత్ జీ20 సమావేశాలను అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లో నిర్వహించింది. ఈ రెండింటిని చైనా, పాకిస్తాన్ ఖండించాయి. చైనా అరుణాచల్ ప్రదేశ్ ని తన భూభాగంగా చెబుతోంది.
ఇదిలా ఉంటే జీ20 సమావేశానికి కొన్ని రోజుల ముందు చైనా కొత్త మ్యాపులను రిలీజ్ చేసింది. దీంట్లో అరుణాచల్ ప్రదేశ్, లఖడ్ భూభాగాలను తనవిగా పేర్కొంది. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ పరిణామాల క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ సమావేశాలకు హాజరుకాలేదు. ఆయన బదులుగా ప్రీమియర్ లీ కియాంగ్ హాజరయ్యారు. తాజాగా ఈ చైనీస్ థింక్ ట్యాంక్ వ్యాఖ్యానిస్తూ..‘‘ దౌత్యపరమైన, ప్రజాభిప్రాయాన్ని భారత్ గందరగోళ పరుస్తూ, వివాదాస్పద భూభాగాల్లో సమావేశాలను నిర్వహించి జీ 20 సమావేశ సహకార వాతావరణాన్ని దెబ్బతీసిందని, ఫలితాల సాధనకు ఆటంకం కలిగించింది’’ అని ఆరోపించింది.