Leading News Portal in Telugu

Rio G20 meet: జీ20 మీటింగ్‌లో పుతిన్ అరెస్టుపై బ్రెజిల్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు..


Rio G20 meet: నేటిలో భారత్ నిర్వహిస్తున్న జీ20 సమావేశాలు పూర్తవుతున్నాయి. వచ్చే ఏడాది బ్రెజిట్ రియో డి జనీరోలో జీ20 సమావేశాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే భారత్ నిర్వహించిన సమావేశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకాలేదు. ఆయన స్థానంలో ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది బ్రెజిల్ నిర్వహిస్తున్న జీ 20 సమావేశాలకు పుతిన్ వస్తారా..? అని ఆ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాని మీడియా ప్రశ్నించిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఏడాది రియో డి జనీరోలో జరిగే గ్రూప్ ఆఫ్ 20 సమావేశానికి రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరైతే బ్రెజిల్ లో అరెస్ట్ చేయమని ఆ దేశ అధ్యక్షుడు లూలా డి సిల్వా శనివారం అన్నారు. తమ దేశంలో జరిగే జీ20 సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ని ఆహ్వానిస్తానని, అంతకుమందు తాను రష్యాలో జరిగే బ్రిక్స్ కూటమి సమావేశాలకు హాజరుకావాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పుతిన్ సులభంగా బ్రెజిల్ రావచ్చని, అతడిని అరెస్ట్ చేసే అవకాశమే లేదని బ్రెజిల్ అధ్యక్షుడిగా తాను చెబుతున్నానని ఆయన లూలా అన్నారు.

ఉక్రెయిన్ యుద్ధంలో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాడని, వందలాది పిల్లలను చట్టవిరుద్ధంగా బహిాష్కరించాడని, యుద్ధనేరాలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మార్చిలో పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్ లో రష్యా బలగాలు యుద్ధ నేరాలకు పాల్పడ్డాయని, ఉక్రెయిన్ పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో పుతిన్ ఇటీవల కాలంలో దేశం విడిచి ఏ అంతర్జాతీయ సమావేశాలకు హాజరుకావడం లేదు. అయితే ఇంటర్నెషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) ఏర్పాటుకు దారి తీసిన రోమ్ శాసనంపై బ్రెజిల్ సంతకం చేసింది. ఈ ఒప్పందంపై సంతకం చేసిన దేశాల్లోకి ఐసీసీ దోషిగా నిర్థారించిన వ్యక్తి వస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.