Leading News Portal in Telugu

Khalistan: “మీ కోసం వస్తున్నాం”.. భారత నాయకులకు ఖలిస్తానీల బెదిరింపు


Khalistan: ఖలిస్తానీ వేర్పాటువాదులు పేట్రేగిపోతున్నారు. కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకే వేదికగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. భారత రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడటంతో పాటు ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులపై దాడికి పాల్పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ‘సిక్ ఫర్ జస్టిస్’ గురుపత్వంత్ సింగ్ పన్నూ భారతీయ నాయకులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఇటీవల జీ20 సదస్సుకు హాజరైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించిన సమయంలో కూడా ఖలిస్తానీ వేర్పాటువాదం, భారత వ్యతిరేక చర్యలపై చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది. ఇదిలా ఉంటే మరోవైపు కెనడాలో ఖలిస్తానీలు రెచ్చిపోతున్నారు. తాజాగా సర్రే, వాంకోవర్ ప్రాంతాల్లోని గురుద్వారాలో ‘ఖలిస్తానీ రెఫరెండం’ నిర్వహించారు.

కెనడాలో జరిగిన ఈ సమావేశంలో నిషేధిత యూఎస్‌కి చెందిన సిక్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత నాయకులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, హోమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శకంర్ లను బెదిరించాడు. ‘హర్దీప్ సింగ్ నిజ్జర్ ను హత్య చేసిన వారికి సందేశం, మీ చావు కోసం పిలుస్తున్నాం.. మోడీ, అమిత్ షా, జైశంకర్ మేము మీ కోసం వస్తున్నాం ’అంటూ ఒక వీడియోలో చెప్పాడు.

హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే కరుడుగట్టిన ఖలిస్తాన్ వేర్పాటువాది ఈ ఏడాది జూన్ నెలలో కెనడాలోని సర్రేలో జరిగిన కాల్పుల్లో మరణించాడు. అంతకుముందు సిక్కు వేర్పాటువాదానికి మద్దతు ఇస్తూ లాహోర్ లో ఉంటున్న పరమజిత్ సింగ్ పంజ్వార్ ని కూడా గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. దీనికి ముందు వేర్పాటువాది బ్రిటన్ లో ఉంటున్న అవతార్ సింగ్ ఖండా అనుమాస్పదంగా మరణించాడు. లాహోర్ ఉంటూ నార్కో టెర్రరిజానికి పాల్పడుతున్న హర్మీత్ సింగ్ హత్య చేయబడ్డాడు.