Leading News Portal in Telugu

Libya: మృతుల దిబ్బగా లిబియా.. 11 వేల మంది మృతి, 10 వేల మంది మిస్సింగ్..


Libya Floods: లిబియా దేశం మృతుల దిబ్బగా మారిపోయింది. డేనియల్ తుఫాన్ జలప్రళయాన్ని సృష్టించింది. వర్షాల ధాటికి రెండు జలశయాలు బద్దలైపోయాయి. దీంతో ప్రజలు వరదల్లో కొట్టుపోయారు. వరదల ధాటికి సమీపంలో ఉన్న సముద్రంలోని ప్రజలు కొట్టుకుపోయారు. ముఖ్యంగా లిబియాలోని తూర్పు నగరమైన డెర్నా దారుణంగా దెబ్బతింది. నగరంలో ఎక్కడా చూసిన మృతదేహాలే కనిపిస్తున్నాయి. వరదల కారణంగా నగరం మొత్తం బురద నిండిపోయింది. బురదలో చనిపోయిన వారి మృతదేహాలు కనిపిస్తుండటంతో ఆ ప్రాంతం అంతా స్మశానాన్ని తలపిస్తోంది.

తాజాగా వరదల వల్ల చనిపోయిన వారి సంఖ్య 11,300కి చేరుకుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మరో 10,100 మంది ఆచూకీ కనిపించలేదని వెల్లడించింది. డెర్నా కాకుండా తూర్పు లిబియాలోని మరో చోట వరదల వల్ల 170 మంది మరణించారు.డేనియల్ తుఫాను ఈశాన్య లిబియాను తాకిత తర్వాత భారీ వర్షాలు సంభవించాయి. దీంతో ప్రళయం ఏర్పడింది. డెర్నా నగరంలో తాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. కలుషిత నీటిని తాగి 55 మంది చిన్నారులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారని యూఎన్ పేర్కొంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య 20,000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆఫ్రికా దేశమైన లిబియా గత కొన్నేళ్లుగా తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంటోంది. అంతర్యుద్ధం, మానవ సంక్షోభం వంటి సమస్యలను చూస్తోంది. తాజాగా ఈ విపత్తు దేశ పరిస్థితిని మరింత దిగజార్చింది.