Leading News Portal in Telugu

Congo Landslide: కాంగోలో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 17మంది మృతి


Congo Landslide: కాంగోలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి 17 మంది చనిపోయారు. కొండచరియలు విరిగిపడటంతో చాలా ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు ఆదివారం తెలిపారు. శిథిలాల కింద ఇంకా మరికొంత మంది కూరుకుపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాంగో నది ఒడ్డున మోంగ్లా ప్రావిన్స్‌లోని లిస్లే నగరంలో ఈ కొండచరియలు విరిగిపడ్డాయి. బాధితులు పర్వతం దిగువన నిర్మించిన ఇళ్లలో నివసించారు. ఈ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల చాలా నష్టం జరుగుతోంది.

వర్షంతో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పడి ప్రజలు చనిపోయారు. శిథిలాలను తొలగించి ప్రజలను రక్షించేందుకు యంత్రాల అవసరం చాలా ఉందని మోంగ్లా గవర్నర్ అన్నారు. బాధిత కుటుంబాలకు గవర్నర్ సంతాపం తెలిపారు. మొత్తం ప్రావిన్స్‌లో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ఏప్రిల్‌లో కూడా కాంగోలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో 21 మంది మరణించారు. చాలా మంది కూడా గల్లంతయ్యారు. బోలోవా గ్రామంలోని నదికి సమీపంలో ఈ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మహిళలు, 13 మంది చిన్నారులు మృతి చెందారు. గత సంవత్సరం సెప్టెంబర్ 2022 లో మసిసి ప్రాంతంలోని బిహాంబ్వే గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.