Leading News Portal in Telugu

Fire Accident: సౌదీ అరేబియాలో అగ్నిప్రమాదం.. తెలుగు యువకుడు సజీవ దహనం


Telangana Man Died in Fire Accident in Saudi Arabia: సౌదీ అరేబియాలో తాజాగా ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గదిలోని ఏసీ యూనిట్‌లో  షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అయితే అగ్నిప్రమాదం రాత్రి పూట జరిగింది. దీంతో ఆ గదిలో ఉన్న ముగ్గురు గాఢనిద్రలో ఉన్నారు. ఈ కారణంగా మంటలు గది అంతా వ్యాపించే వరకు వారు నిద్ర లేవదు. దీంతో ఒక్కసారిగా మంటలు వారిని చుట్టుముట్టాయి. దాంతో గదిలో ఉన్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. చనిపోయిన ముగ్గురు కూడా ప్రవాసులే.  వీరిలో తెలంగాణకు చెందిన 39 ఏళ్ల మహమ్మద్ జావీద్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. నిర్మల్ జిల్లా  దిల్వార్‌పూర్ మండలానికి చెందిన వ్యక్తి జావీద్. అతడు జెడ్డాలోని సౌదీ కుటుంబం వద్ద  డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ ప్రమాదంలో జావిద్ తో పాటు చనిపోయిన మరో ఇద్దరు వ్యక్తులు బంగ్లాదేశ్ కు చెందిన వారు. వీరు ముగ్గురు ఒక వసతి  గృహంలో నివసిస్తున్నారు. గదిలో మంటలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సలహా ఇచ్చారు. అయితే వారు వచ్చేటప్పటికే  మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. చనిపోయిన వారిలో ఇద్దరు బంగ్లాదేశీయులతో పాటు జావీద్ ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. వారి కుటుంబానికి ఆధారమైన జావీద్ చనిపోవడంతో వారి కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. అతడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబం సభ్యులు భారతఎంబసీని కోరుతున్నారు.  మృతుడికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారందరి పోషణ జావీదే చూసుకుంటున్నాడు. అయితే ఈ మధ్యనే జావీద్ తండ్రి క్యాన్సర్ తో చనిపోయాడు. జావీద్ కూడా భారత్ కు త్వరలోనే తిరిగి రావాలనుకున్నాడు. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది.