Nigeria: ఆఫ్రికా దేశం నైజీరియాలో బందిపోట్లు రెచ్చిపోయారు. గుంపులుగా వచ్చి యూనివర్సిటీలో ఉన్న 24 మంది మహిళా విద్యార్థినులతో సహా 30 మందిని కిడ్నాప్ చేశారు. ఆయుధాలతో వచ్చిన వీరంతా లేడీస్ హాస్టళ్లలో నివసిస్తున్న వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వాయువ్య నైజీరియాలోని జంఫారా రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్ర రాజధాని గుసౌ వెలుపల ఉన్న ఫెడరల్ యూనివర్సిటీతో ఈ ఘటన జరిగింది.
దేశ భద్రతను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి అధ్యక్షుడిగా బోలా అహ్మద్ టినుబు అధికారం చేపట్టిన తర్వాత ఇది తొలిదాడి. బందిపోట్లు యూనివర్సిటీలోకి మోటార్ సైకిళ్ల ద్వారా ప్రవేశించి కిటికీలను పగలగొట్టి హాస్టల్ గదుల్లోకి ప్రవేశించారు. దాడి చేసిన సమయంలో యూనివర్సిటీ పనులు చేస్తున్న వెల్డర్లను బందిపోట్లు తమ అదుపులో ఉంచుకున్నారు. ఘటన స్థలానికి రాజధాని గుసౌ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమాచారం అందుకున్న వెంటనే భద్రత బలగాలు అక్కడి నుంచి మోహరించాయి. బందిపోట్లు, భద్రతాబలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థినులను కాపాడాయని అక్కడి అధికారులు చెప్పారు. సైనిక చర్య కొనసాగుతుందని వెల్లడించారు. వాయువ్య, మధ్య నైజీరియా రాష్ట్రాల్లో జంఫారా ఒకటి. ఇక్కడ తరుచుగా గ్రామాలపై బందిపోట్లు దాడులు చేసి జనాలను చంపడం, కిడ్నాప్ చేయడం చేస్తుంటారు. ఈ ముఠాలు జంఫారా, కట్సినా, కడునా, నైజర్ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. గ్రామాలు, పాఠశాలల్లోని విద్యార్థులను కిడ్నాప్ చేస్తూ, ప్రభుత్వ, వారి కుటుంబ సభ్యుల నుంచి డబ్బలు వసూలు చేస్తుంటారు.
2021లో జంఫారా రాష్ట్రంలోని జంగేబే పట్టణంలోని బాలికల బోర్డింగ్ పాఠశాలపై దాడి చేసి 300 మందికి పూగా విద్యార్థులను కిడ్నాప్ చేశారు. రెండు రోజుల తర్వాత డబ్బు చెల్లించడంతో వారిని విడుదల చేశారు. మరోవైపు నైజీరియా ఈశాన్య ప్రాంతంలో 14 ఏళ్లుగా జీహాదీలు తిరుగుబాటు చేస్తున్నారు. వీరివల్ల 40,000 మంది మరణించారు. రెండు మిలియన్ల మంది తమ ఇళ్లను విడిచిపెట్టారు.