Pakistan: పాకిస్తాన్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.ఆదివారం పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో ప్యాసింజర్ రైలు ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 31 మంది గాయపడినట్లు మీడియా పేర్కొంది. అయితే మరణాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. షేక్ పురా జిల్లాలోని ఖిలా సత్తార్ షా స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
మియాన్వాలి నుంచి లాహోర్ వెల్లే ప్యాసింజర్ రైలు, గూడ్సు రైలు ఉన్న అదే ట్రాకులోకి రావడంతో ప్రమాదం జరినట్లు జియో న్యూస్ నివేదించింది. ట్రాకులో ఉన్న గూడ్సు రైలును చూసిన ప్యాసింజర్ రైలు డ్రైవర్, రైలును ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో 31 మంది ప్రయాణికులు గాయపడినట్లు, అందులో ఐదుగురు ప్రయాణికులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించినట్లు రెస్క్యూ సిబ్బంది వెల్లడించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన లాహోర్ డివిజన్ లో రైలు కార్యకలాపాలు సజావుగా నడుస్తున్నాయని అక్కడి రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదం తరువాత ట్రాకును క్లియర్ చేశారు. రైలు డ్రైవర్ ఇమ్రాన్ సర్వర్ మరియు అతని సహాయకుడు ముహమ్మద్ బిలాల్తో సహా నలుగురు రైల్వే అధికారులను సస్పెండ్ చేసినట్లు పాకిస్తాన్ రైల్వే తెలిపింది. దీనిపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసినట్లు, 24 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు.
బ్రిటీష్ వారు వేసిన పట్టాలపైనే ఇప్పటికీ పాకిస్తాన్ రైల్వే నడుస్తోంది. ఆ దేశంలో రైలు వ్యవస్థ విద్యుదీకరించలేదు. పాకిస్తాన్ లో రైలు ప్రమాదాలు సర్వ సాధారణం అయిపోయాయి. తరుచుగా రైళ్లు పట్టాలు తప్పడం చూస్తుంటాం. ఈ ఏడాది ఆగస్టులో కరాచీకి 275 కిలోమీటర్ల దూరంలో నవాబ్ షా జిల్లాలో సహారా రైల్వే స్టేషన్ సమీపంలో హజారా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 56 మంది మరణించారు.