Leading News Portal in Telugu

NASA: 7 ఏళ్ల తర్వాత గ్రహశకల నమూనాతో భూమిని చేరిన నాసా క్యాప్సూల్..


NASA: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్ట్రాయిడ్ మిషన్ సక్సెస్ అయింది. దాదాపుగా 7 ఏళ్ల తరువాత బెన్నూ అనే గ్రహశకలంపై నుంచి నమూనాలను భూమిపైకి తీసుకువచ్చింది. ఆదివారం అమెరికా ఊటా రాష్ట్రంలో ఎడారిలో నాసా క్యాప్సూల్ దిగింది. నాసా 2016లో ‘ఒరిసిస్ రెక్స్’ అనే స్పేస్ ప్రోబ్ ను అంతరిక్షంలోకి పంపింది. సుమారు 3 ఏళ్లు ప్రయాణించి బెన్నూ అనే గ్రహశకలాన్ని చేరింది. మొత్తంగా మళ్లీ భూమిని చేరడానికి ఏడేళ్లు పట్టింది.

దాదాపుగా 250 గ్రాముల నమూనాలను ఓరిసిస్ రెక్స్ భూమికి తీసుకువచ్చింది. ఇంత వరకు ఇంత పెద్ద నమూనాలనను ఏ ప్రయోగంలో భూమికి తీసుకు రాలేదు. ఈ మిషన్ ద్వారా సౌర వ్యవస్థ ఏర్పాటు, భూమి నివాసయోగ్యం ఎలా అయిందనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వాతావరణం అనుకూలించడంతో ఈ రోజు అంతరిక్షం నుంచి ఒరిసిస్ రెక్స్ స్పేస్ ప్రోబ్ నమూనాలు ఉన్న క్యాప్సూల్ ని భూమిపైకి జార విడిచింది. గంటకు 43,000 కిలోమీటర్ల వేగంతో వాతావరణంలోకి ప్రవేశించింది. ఈ సమయంలో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు 2800 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునేలా క్యాప్సూల్ ని నాసా డిజైన్ చేసింది. ఎడారిలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు రెండు పారాచూట్ లు సురక్షితంగా క్యాప్సూల్ ని ఎడారిలో నేలపై ల్యాండ్ చేసింది.

నాసా కన్నా ముందు జపనీస్ స్పేస్ ఏజెన్సీ ఇలాగే గ్రహ శకలం నుంచి నమూనాలను సేకరించింది. దీంట్లో RNAలో ఉన్న యురేసిల్ ఉన్నట్లు కనుగొన్నారు. భూమిపై నీరు, జీవావన్ని గ్రహశకలాలు మోసుకువచ్చాయనే అభిప్రాయం శాస్త్రవేత్తల్ ఉంది. దీంతోనే గ్రహశకలాల నమూనాలపై అధ్యయనం జరుగుతోంది. 500 మీటర్ల వ్యాసం ఉన్న బెన్నూ గ్రహశకలం ప్రతీ ఆరేళ్లకు ఒకసారి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. 2182లో ఇది భూమి ఢీకొనే అవకాశం ఉంది. ఈ గ్రహశకలం మార్గాన్ని నాసా అధ్యయనం చేస్తోంది.