Interpol: భారత్-కెనడాల మధ్య ఖలిస్తాన్ అంశం చిచ్చు పెట్టింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించారు. మరోవైపు కెనడాలో ఉంటున్న ఖలిస్తానీ వేర్పాటువాదులు మాత్రం భారత విద్వేష వైఖరని మరింత తీవ్రతరం చేశారు. అక్కడ ఉండే హిందువులకు కెనడా విడిచి వెళ్లాలని వార్నింగ్ ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సభ్యుడు కరణ్‌వీర్ సింగ్ పై ఇంటర్‌పోల్ సోమవారం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ గా పిలువబడే ఇంటర్‌పోల్ ఈ ఖలిస్తానీ ఉగ్రవాదికి కోసం నోటీసులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం కరణ్ వీర్ సింగ్ పాకిస్తాన్ లో తలదాచుకుంటున్నట్లు సమాచారం.
ఇంటర్‌పోల్ పోర్టల్ ప్రకారం 38 ఏళ్ల కరణ్ వీర్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలా జిల్లాకు చెందిన వాడు. క్రిమినల్ కుట్రలు, హత్య, ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరించడం వంటి కేసులపై అతడిని అప్పగించాని భారత్ కోరుతోంది.
రెడ్ కార్నర్ నోటీసులు అనేది నేరం చేసి విదేశాల్లో తలదాచుకుంటున్న నేరగాళ్లను అరెస్ట్ చేయాలని ఇంటర్ పోల్ తన సభ్యదేశాలకు ఇచ్చే నోటీసులు. విదేశాలకు పారిపోయినట్లు భావిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది కరణ్ వీర్ సింగ్ పై నోటీసులు జారీ చేయడం రోహ్‌తక్ పోలీసుల విజయమని హర్యానా పోలీస్ అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో కెనడా వ్యవహారం, ఖలిస్తాన్ అంశాల నేపథ్యంలో ఖలిస్తాన్ ఉగ్రవాది కరణ్ వీర్ సింగ్ పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.