Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ రసవత్తంగా మారింది. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల్లో అభ్యర్థులు తలపడుతున్నారు. ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పాటు ఇండో అమెరికన్ల వివేక్ రామస్వామి, నిక్కీహేలీలు పోటీలో ఉన్నారు. అయితే ఇటీవల వివేక్ రామస్వామి తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ట్రంప్ కి తన మద్దతు ఉంటుందని, యూఎస్ క్యాపిటల్ అల్లర్లకు పాల్పడిన వ్యక్తులకు తాను అధ్యక్షుడినైతే క్షమాభిక్ష పెడతానని, హెచ్1బీ వీసాల ప్రక్రియను సమీక్షిస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ సమస్యలపై ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా 2021 లో కోవిడ్ వల్ల 5.9 లక్షల కోట్ల డాలర్ల సంపదను కోల్పోయింది. ఇప్పటికీ దెబ్బ నుంచి అమెరికా కోలుకోలేకపోతోంది, వృద్ధిరేటు మందగమనంలో ఉంది. దీనిపై వివేక్ రామస్వామి స్పందించారు.
సోమవారం ఆమెరికా ఆర్థికవ్యవస్థపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశం ఈ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టేక్కాలంటే రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తిని సీఈఓగా తీసుకుంటానని అన్నారు. ప్రతీ విభాగాన్ని సున్నా నుంచి మొదలు పెడతానని పేర్కొన్నారు. గతేడాది బడ్జెట్ లో చేసని తప్పులు మళ్లీ జరగకుండా అంతా పారదర్శకంగా ఉండేలా చూస్తానని తెలిపారు. జాతీయ రుణ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు జీరో బేస్ బడ్జెట్‌ని ప్రతిపాదించారు. గతంతో ఔషధరంగంలో ఎన్నో కంపెనీలకు పోటీగా బయోటిక్ కంపెనీని ఏర్పాటు చేసి అభివృద్ధి చేశానని, బ్లాక్ రాక్, వాన్ గార్డ్ తో పోటీగా స్ట్రైవ్ అస్సెట్ మేనేజ్మెంట్ తీసుకొచ్చానని, కానీ ఇప్పుడు ఫెడరల్ ప్రభుత్వానికి అంతకంటే గొప్ప పోటీగా నిలబడబోతున్నానని ఆయన అన్నారు.