Leading News Portal in Telugu

New York Sinking: బరువు మోయలేక కూరుకుపోతున్న న్యూయార్క్.. నాసా రిపోర్టులో వెల్లడి..


New York Sinking: అమెరికాలో అతిపెద్ద నగరం న్యూయార్క్ దాని బరువును మోయలేకపోతోంది. నగరం వేగంగా కూరుకుపోతోంది. అనుకున్నదానికన్నా వేగంగా న్యూయార్క్ సిటీ నేలలోకి కూరుకుపోతున్నట్లు నాసా రిపోర్ట్స్ తెలిపాయి. నగరంలోని లాగ్వార్డియా ఎయిర్‌పోర్ట్, ఆర్థర్ ఆష్ స్టేడియం, కోని ఐలాండ్ మొదటగా ప్రభావితం అవుతున్నాయని నాసా వెల్లడించింది. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబోరేటరీ, రట్జర్స్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధన ప్రకారం న్యూయార్క్ వేగంగా కూరుకుపోతోందని, ప్రతీ ఏటా 1.6 మిల్లీమీటర్ల చొప్పున మునిగిపోతోందని వెల్లడించాయి.

2016-2023 వరకు పరిశీలిస్తే యూఎస్ ఓపెన్ వెన్యూ ఆర్థర్ ఆషే స్టేడియం, లాగార్డియా ఎయిర్‌పోర్టులోని రన్ వే అత్యధికంగా కుంగిపోయాయి. ఏడాదికి 3.7 నుంచి 4.6 మిల్లీమీటర్ల చొప్పున నేల కుంగింది. ఈ రెండు ప్రదేశాలు పల్లపు ప్రాంతాల్లో ఉన్నందున వేగంగా కుంగిపోతున్నట్లు తేలింది. ఇదిలా ఉంటే సముద్రమట్టాలు పెరగడం వల్ల నగరం మునిగిపోయే ముప్పు పెరుగుతోంది. హరికెన్లు, తుఫానులు నగరంలో వరదలకు కారణమవుతున్నాయి.

మాన్‌హట్టన్-న్యూజెర్సీని కలిపే హాలండ్ టన్నెల్ గుండా వెళ్తున్న ఇంటర్ స్టేట్ 78 కూడా నగరంలో మిగిలిన ప్రాంతాల కన్నా రెట్టింపు స్థాయిలో కుంగిపోతోందని నాసా వెల్లడించింది. స్టాటెన్ ఐలాండ్ లోని గవర్నర్స్ ఐలాండ్, మిడ్ ల్యాండ, సౌత్ బీచ్ లోని దక్షిణ భాగం, సౌత్ క్వీన్స్ లోని తీర ప్రాంతాలైన ఆర్వైర్న్ బై ది సీ కూడా వేగంగా కుంగిపోతున్నాయి.

అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం న్యూయార్క్ మహానగరంం 1 మిలియన్ భవనాల బరువు 764,000,000,000 కిలోగ్రాములు లేదా 1.68 ట్రిలియన్ పౌండ్‌లుగా ఉందని, దీంతో తన బరువు కారణంగా న్యూయార్క్ సిటీ వేగంగా నేలలోకి కుంగిపోతుందని కనుగొంది. గురుత్వాకర్షణ శక్తి భవన ద్రవ్యరాశిని కిందికి లాగుతోంది. పెరిగిన పట్టణీకరణ, అండర్ గ్రౌండ్ పంపింగ్ వ్యవస్థ కూడా కుంగిపోవడానికి కారణమవుతోంది. దీంతో పాటు ఈ నగరం అట్లాంటిక్ తీరం వెంబడి ఉంది. అట్లాంటిక్ తీరంలో ప్రపంచసగటు కన్నా సముద్రమట్టాలు 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంది.