Leading News Portal in Telugu

Ramiz Raja: జట్టు ఆట తీరును మార్చుకోవాలి.. సొంత టీమ్పై పాక్ మాజీ క్రికెటర్ విమర్శలు


ప్రపంచకప్‌కు ముందు వార్మప్ మ్యాచ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్తో తలపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 345 పరుగులు చేసింది. అయితే న్యూజిలాండ్ కేవలం 43.4 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 346 పరుగులు చేసి విజయం సాధించింది. వార్మప్ మ్యాచ్ లో ఓటమి చెందిన తర్వాత పాక్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. జట్టు ఓటమిపై పాక్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

భారత పిచ్‌లకు అనుగుణంగా పాక్ జట్టు మలచుకోవాల్సి ఉంటుందని రమీజ్ రాజా అన్నాడు. ఇది కేవలం ప్రాక్టీస్ మ్యాచే.. కానీ విజయం విజయమే అని తెలిపాడు. విజయం మీకు అలవాటే కానీ.. ఇప్పుడు నిరంతరం ఓడిపోవడం అలవాటుగా మారిందని విమర్శించాడు. ఆసియా కప్‌లో మొదటి మ్యాచ్ లోనే ఓడిన పాక్ జట్టు.. ఇప్పుడు ప్రపంచకప్‌కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఓడిపోయిందని అన్నాడు.

పాకిస్థాన్ పై న్యూజిలాండ్ అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన చూపించిందని రమీజ్ రాజా అన్నాడు. అయితే భారత పిచ్‌లు ఇలాగే ఉంటే 400 పరుగులు చేయాల్సి వస్తుందని అన్నాడు. అంతేకాకుండా జట్టు మార్పులు గమనించుకోవాలని తెలిపాడు. ఇలానే ఉంటే.. బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు రిస్క్ తీసుకోవాల్సి వస్తుందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. పాక్ జట్టు మొదటి 10-15 ఓవర్లలో చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేసి, ఆపై భారీ షాట్లు కొట్టడానికి ప్రయత్నిస్తుందని చెప్పాడు. ఇలా ఆడుతున్న పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోవాలని రమీజ్ రాజా అన్నాడు.