Leading News Portal in Telugu

Hydrogen Bus: హైడ్రోజన్ బస్సులో టెస్ట్ డ్రైవ్ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. పిక్స్ వైరల్!


Union Minister Nitin Gadkari took a momentous test drive in a hydrogen bus at Prague: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుతం చెక్‌ రిపబ్లిక్‌ పర్యటనలో ఉన్నారు. ప్రేగ్‌ నడిబొడ్డున నిర్వహించిన 27వ వరల్డ్ రోడ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న గడ్కరీ.. సోమవారం అత్యంత అధునాతన సాంకేతికతో అభివృద్ధి చేసిన హైడ్రోజన్‌ ఫ్యూయల్ బస్సులో (టెస్ట్ డ్రైవ్) ప్రయాణించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హైడ్రోజన్ బస్సును పూర్తిగా పరిశీలించారు. ఇందుకు సంబందించిన ఫొటోలు, వీడియోను నితిన్ గడ్కరీ తన సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

‘కర్బన ఉద్గారాల విడుదల తగ్గింపు, పర్యావరణ పరిరక్షణలో హైడ్రోజన్‌ ఫ్యూయల్ బస్సులు కీలక పాత్ర పోషిస్తాయి. స్వచ్ఛమైన పచ్చటి భవితను అందించేందుకు ఈ బస్సులు ఎంతో దోహదపడుతున్నాయి’ అని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ పోస్టుకు హైడ్రోజన్‌ ఫ్యూయల్ బస్సులో తాను ఉన్న పోటోలను జత చేశారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హైడ్రోజన్‌ ఫ్యూయల్ బస్సులు హైడ్రోజన్‌ వాయువును వాడుకొని విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకొంటాయి. అక్టోబరు 1న ప్రేగ్‌లో ఏర్పాటు చేసిన 27వ వరల్డ్ రోడ్ కాంగ్రెస్‌ సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. రహదారి భద్రత లక్ష్యాలను సాధించడం కోసం భారతదేశం నిరంతరాయంగా కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.