BR Ambedkar’s Largest Statue Unveiled In America: భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అతిపెద్ద విగ్రహం అమెరికాలో ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. భారతదేశం వెలుపల అంబేద్కర్ యొక్క అతిపెద్ద విగ్రహం అమెరికాలోని మేరీల్యాండ్‌లో అక్టోబర్ 14న ఆవిష్కరించబడుతుంది. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ పేరుతో 19 అడుగుల విగ్రహాన్ని నిర్మించారు. మేరీల్యాండ్‌లోని అకోకీక్ నగరంలో 13 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ (ఏఐసీ)లో భాగంగా ఈ విగ్రహాన్ని నిర్మించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బోధనలు, సిద్ధాంతాలను వ్యాప్తి చేసే ఉద్దేశంతో ఈ విగ్రహంను ఏర్పాటు చేశామని ఏఐసీ తెలిపింది. అంతేకాదు సమానత్వం మరియు మానవ హక్కుల చిహ్నంగా కూడా ఇది ప్రదర్శిస్తుందని ఏఐసీ పేర్కొంది. ఇది భారతదేశం వెలుపల అంబేడ్కర్ అతిపెద్ద విగ్రహం అని, ఇది అక్టోబర్ 14న ఆవిష్కరించబడుతుందని చెప్పింది. అక్టోబర్ 14న మేరీల్యాండ్‌లో జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు హాజరవుతారు. గుజరాత్‌లోని సర్దార్ పటేల్ విగ్రహాన్ని (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) రూపొందించిన ప్రముఖ విగ్రహ రూపశిల్పి రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు.